02-01-2026 12:57:41 AM
మొయినాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, దేవాలయాలు అభివృద్ధి చెందినప్పుడే ప్రజలకు మనశ్శాంతి, ప్రశాంతత లభిస్తుందని తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ రిప్రజెంటేటివ్ (స్పోరట్స్ అఫైర్స్), న్యూఢిల్లీ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. గురువారం నూతన సంవత్సరం సందర్భంగా మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి, పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం జితేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు బల్వంత్ రెడ్డి, జగన్ రెడ్డి, వెంకట్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రీదివ్య మురళీధర్ రెడ్డి, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.