23-11-2025 12:00:23 AM
తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య
ముషీరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం జీవో 46ను విడుదల చేసి బీసీలను మోసం చేసిందని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలకు కలిపి 50 శాతం లోపు రిజర్వేషన్లు కొనసాగిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి మార్గదర్శకాలను విడుదల చేయడం దారుణమన్నారు. బీసీలను దగా చేసే జీవో 46ను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రెండు రోజుల్లో అన్ని సంఘాలతో సమావేశమై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు.
ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బిసిల రిజర్వేషన్లపై ఒక వైపు హైకోర్టులో వాదనలు కొనసాగించడానికి గడువు ఉన్నప్పటికి ఆ దిశగా నిబద్ధతతో చర్యలు తీసుకోవాల్సిన ప్రభు త్వం ముందుగానే చేతులు ఎత్తివేసి జీవోను ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, అందుకు కట్టుబడి ఉన్నామని, గత రెండేళ్లుగా ప్రభుత్వం ప్రకటిస్తూ బిసిలను మోసం చేస్తూ బిసిలను మభ్యపెట్టిందని విమర్శించారు.
ఈనెల 20న డెడికేటేడ్ కమిషన్ నివేదిక ఇచ్చిందంటూ, ఆ నివేదిక ఆధారంగా జీవో 46ను విడుదల చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సిఎం రేవంత్ రెడ్డి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి 42 శాతం రిజర్వేషన్లపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై ఒత్తిడి చేయాలని సూచించారు. ప్రధాన మంత్రి దృష్టికి సమస్యను తీసుకువెళితే పరిష్కారం అయ్యేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్నికలను వాయిదా వేసి కోర్టులో జడ్జిమెంట్ వచ్చేంతవరకు అగాలని కోరారు. లేని పక్షంలో బిసిల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, కొండ దేవయ్య, పగిళ్ల సతీష్ కుమార్, టి.రాజ్ కుమార్, చిక్కుడు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.