21-08-2025 01:39:19 AM
హనుమకొండ, ఆగస్టు 20 (విజయ క్రాంతి):హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఈనెల 22 నుండి ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో 2025 ఆర్థిక సంవత్సరానికి గాను 100 రోజుల కూలి పని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ ల ఆధ్వర్యంలో ఈనెల 22 నుండి పనుల జాతర నిర్వహించుటకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లావ్యాప్తంగా పూర్తయిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలతోపాటు కొత్త పనులకు భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించేందుకు పెద్ద ఎత్తున పనుల జాతరను 2025 సంవత్సరానికి గాను నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారు. 7 కోట్ల 13 లక్షల 40 వేల రూపాయల విలువైన 2618 పనులకు ప్రారంభోత్సవాలు, భూమి పూజలు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని పూజలు చేయనున్నారు.
ఉపాధి హామీ పథకం, వాటర్షెడ్ పథకం, ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, స్వచ్ఛభారత్ తదితర పనులకు ప్రారంభోత్సవాలు భూమి పూజలు చేయనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు నియోజకవర్గాల పరిధిలో పాల్గొననున్నారు.
పంచా యతీ భవనాలు, నూతన గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, స్వచ్ఛభారత్ మిషన్, ఇరిగేషన్, కమ్యూనిటీ, శానిటరీ కాంప్లెక్స్, ఇందిరా మహిళా శక్తి, ఉపాధి భరోసా, వ్యక్తిగత ఆస్తుల కల్పన పనులు పశువుల కొట్టం, గొర్రెల షెడ్డు, పండ్ల తోటలో వానపాముల, ఎరువుల తయారీ అజోలా ఫిట్ నిర్మాణము జల నిధి, వాన నీటి సంరక్షణ భూగర్భ జలాలు పెంచే పారం పాంట్స్, ఊట కుంటలు తదితర పనులకు ప్రారంభోత్సవాలు భూమి పూజలు నిర్వహించనున్నారు.
రైతులకు లబ్ధిదారులకు మంజూరైన ఉత్తర్వులను గ్రామసభల్లో సంబంధిత శాఖ అధికారులు అందజేయనున్నారు. ఉపాధి హామీ పథకంలో ఎక్కువ రోజులు పనిచేసిన కూలీలను, దివ్యాంగులను, పారిశుద్ధ్య కార్మికులను, హరిత సంరక్షకులను పనుల జాతర కార్యక్రమాలలో సన్మానాలు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా పై కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.