06-01-2026 12:00:00 AM
ఐదేళ్లలో 24 సెంచరీలు.. అది కూడా బ్యాటర్లకు సవాల్‌గా నిలిచే టెస్ట్ ఫార్మాట్‌లో.. మంచినీళ్లు తాగినంత ఈజీగా శతకాలు బాదేస్తున్నాడు.. అతనెవరో కాదు ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జో రూట్.. సమకాలిన క్రికెట్‌లో అందులోనూ రెడ్ బాల్ ఫార్మాట్‌లో అద్భుతమైన ఆటగాడి గా పేరు తెచ్చుకున్న రూట్ తాజాగా యాషెస్ సిరీస్ చివరి టెస్టులో శతకం సాధించాడు. ఈ సెంచరీతో పాంటింగ్ రికార్డును సమం చేయడమే కాదు పరుగుల వేటలో సచిన్ రికార్డు దిశగా దూసుకెళుతున్నాడు.
టెస్ట్ క్రికెట్‌లో సరికొత్త మార్క్
సచిన్ రికార్డుల దిశగా రూట్
సిడ్నీ, జనవరి 5 : ఒక క్రికెటర్ సత్తా ఏంటనేది టెస్ట్ ఫార్మాట్ తోనే తెలుస్తుంది. ఎందుకంటే టీ20 తరహాలో ధనాధన్ షాట్లు బాదేయడం కాదు.. వన్డే తరహాలో దూకుడుగా ఆడడం కాదు.. టెస్టు ల్లో ఓపిగ్గా ఆడాలి.. భారీ ఇన్నింగ్స్‌లు నిర్మించాలి. అన్నింటికీ మించి పరిస్థితులకు తగ్గట్టు నిదానం గా ఆడాలి.. అలా ఆడడమే కాదు సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్..
ఆరేళ్ళలో 26 సెంచరీలు బాదాడంటే రూట్ ఏ విధం గా ఆడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యే కించి బ్యాటర్ సత్తా కు పరీక్ష పెట్టే టెస్ట్ ఫార్మాట్‌లోనే రూట్ ఏకంగా 24 శతకాలు బాదాడు. ఈ ఇం గ్లాండ్ క్రికెటర్ క్రీజులో కుదురుకున్నాడంటే సెంచరీ అం దాల్సిందే. తద్వారా సమకాలిన క్రికెట్‌లో తిరుగులేని రికార్డులు సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా యాషెస్ సిరీస్ చివరి టెస్టులోనూ రూట్ అదరగొట్టాడు. ఆస్ట్రేలియా గడ్డపై యా షెస్ సెంచరీ కోసం జో రూట్ ఎన్నో ఏళ్లు ఎదురుచూశాడు. కానీ ఒకసారి తలుపు తెరిచాక సెంచరీల ప్రవాహం మాత్రం ఆగడం లేదు.
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఐదో టెస్ట్ రెండో రోజున రూట్ తన 41వ టెస్ట్ సెంచరీ బాదాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఆసీస్ దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును సమం చేస్తూ, టెస్ట్ క్రికెట్ చరిత్రలో మూడో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 35 ఏళ్ల రూట్‌కు ఈ సిరీస్‌లో ఇది రెండో సెంచరీ. 41 శతకాలు సాధించడానికి ఈ ఇంగ్లాండ్ క్రికెటర్ 163 టెస్టులు ఆడితే... పాంటింగ్ 168 టెస్టులు ఆడాడు. ప్రస్తుతం రూట్ కంటే ముందు సచిన్ టెండూల్కర్ (51 సెంచరీలు) జాక్ కల్లీస్ (45 సెంచరీలు) ఉన్నారు. 2020 వరకూ ఫ్యాబ్ జాబితాలో రూట్ చివరి ప్లేస్‌లో ఉన్నాడు.
అప్పుడు విరాట్ కోహ్లీ 27 టెస్ట్ సెంచరీలతో టాప్ ప్లేస్‌లో ఉంటే రూట్ కేవలం 17 శతకాలు మాత్రమే సాధించాడు. కానీ 2021 నుంచి టెస్టుల్లో రూట్ పరుగుల వరద పారిస్తున్నాడు. కోహ్లీని వెనక్కి నెట్టేసి మరో 24 శతకాలు బాదేసాడు. గత ఐదేళ్లుగా టెస్టుల్లో అత్యంత నిలక డగా రాణించిన బ్యాటర్ రూట్ మాత్రమే. ఇదే సమయంలో శుభమన్ గిల్ అన్ని ఫార్మాట్లలో కలిపి 19 అంతర్జాతీయ సెంచరీలు చేస్తే రూట్ కేవలం టెస్టుల్లోనే 24 శతకాలు బాదాడు.
యా షెస్ సిరీస్‌లో ఆసీస్ గడ్డపై ఒకటికంటే ఎక్కువ సెంచరీలు చేసిన నాలుగో ఇంగ్లండ్ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఎలైట్ జాబితాలో మైకేల్ వాన్, అలస్టర్ కుక్ ఇప్పటికే ఉన్నారు. ఇక పరుగుల పరంగా ఇప్పటికే పాంటింగ్, సంగక్కరలను దాటేసిన రూట్.. సచిన్ రికార్డుకు అతి చేరువయ్యాడు. ఇంకో 2000 పరుగులు చేస్తే, టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచే అవకాశముంది.
సచిన్ టెస్టుల్లో 15,921 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉండగా, రూట్ ఇప్పటివరకూ 13,937 రన్స్ సాధించాడు. మరో రెండేళ్లలో రూట్ క్రికెట్ గాడ్ రికార్డును అధిగమించే అవకాశముందని భావిస్తున్నారు. ఈ జాబితాలో రూట్‌కు దరిదాపుల్లో ఇప్పుడు క్రికెట్ ఆడుతున్న వారు ఎవరూ లేరు. గత నాలుగైదు సంవత్సరాలుగా రూట్ ఫామ్ అసాధార ణంగా ఉంది. 2021 తర్వాత మాత్రమే అతను 24 టెస్ట్ సెంచరీలు బాదాడు. రెండో స్థానంలో ఉన్న స్టీవ్ స్మిత్ కేవలం 10 శతకాలతోనే ఉన్నాడు.
