calender_icon.png 27 August, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జస్టిస్‌ పర్వతరావు కన్నుమూత

11-12-2024 09:54:12 PM

హైదరాబాద్ (విజయక్రాంతి): ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌. పర్వతరావు (90) హైదరాబాద్‌లో బుధవారం కన్నుమూశారు. జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. ఆయనకు ముగ్గురు కుమార్తెలున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జస్టిస్‌ పర్వతరావు తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ కోదండరాం ఆయన అల్లుడు. భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పలువురు ప్రముఖులు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

జస్టిస్‌ పర్వతరావు 1961లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. నాటి అడ్వకేట్‌ జనరల్‌ డి. నరసరాజు ఛాంబర్‌లో జూనియర్‌గా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 1990 మార్చి 16న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1997 నవంబర్‌ 26 వరకు న్యాయమూర్తిగా కొనసాగారు. పలు చారిత్రక తీర్పులను వెలువరించారు. ఎంసెట్‌ రాసిన విద్యార్థులకు తమ జవాబు పత్రాన్ని తిరిగి మూల్యాంకనం చేసే హక్కు ఉంటుందనే తీర్పు వెలువరించారు. న్యాయమూర్తిగా పదవీ విరమణ తరువాత రాష్ట్ర వినియోగదారుల ఫోరమ్‌ ఛైర్మన్‌గా కొంతకాలం పనిచేస్తుండగా, ప్రభుత్వం మౌలిక వసతులు కల్పన విఫలమైందని చెప్పి ఆ పదవికి రాజీనామా చేశారు.

ప్రజ్ఞా భారతి, భారతీయ ఆదివక్త పరిషత్‌ వంటి సంస్థలతో కలిసి పనిచేశారు. సేంద్రియ వ్యవసాయంపై పలు జిల్లాల్లో రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. గోశాలను స్థాపించారు. సుమారు 30 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. గ్రామీణ విద్యను ప్రోత్సహించేందుకు పాఠశాలను స్థాపించారు. దేశ వ్యాప్తంగా స్నేహితులు, శ్రేభియోలాషులు ఉన్నారు. జస్టిస్‌ పర్వతరావు మృతితో అలుపెరుగని స్ఫూర్తిదాయక దిగ్గజం నెలకొరిగిందని పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు.