calender_icon.png 27 August, 2025 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక కాలేజీల పర్యటన

12-12-2024 12:06:50 AM

  1. కళాశాల విద్యపై విద్యాకమిషన్ అధ్యయనం 
  2. త్వరలోనే మరోసారి జిల్లాల పర్యటన
  3. క్షేత్రస్థాయిలోని సమస్యలపై నివేదిక రూపకల్పన
  4. ఆ తర్వాత ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్న కమిషన్

హైదరాబాద్, డిసెంబర్11 (విజయక్రాంతి): కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పులు తీసుకొచ్చేందుకు తెలంగాణ విద్యా కమిషన్ కృషిచేస్తోంది. పాఠశాల విద్య, కళాశాల విద్య, సాంకేతిక విద్యలోని సమస్యలపై దృష్టిసారించింది. విద్యాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, సమస్యలను తెలుసుకొని ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేయనుంది.

ఈక్రమంలోనే ఒక్కో అంశంపై ఓ నివేదికను రూపొందించే పనిలో పడింది. అందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తోంది. ఇప్పటికే పాఠశాల విద్యపై రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీలను జిల్లాల వారీగా పరిశీలించింది. ఈనెల 7తో ఆ పర్యటనలు ముగిశాయి.

బడుల్లోని సమస్యలను తెలుసుకునేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యానిపుణులతో సమావేశాలు నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకుంది. మూడునాలుగు రోజుల్లో ప్రభుత్వానికి కమిషన్ నివేదికను సమర్పించనున్నది. స్కూళ్లలో ఇటీవల మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజన్ ఘటనలు చాలా చోటుచేసుకోవడంతో వాటిని పరిష్కరించేలా పలు సిఫార్సులనూ ప్రభుత్వానికి చేయనుంది. 

త్వరలో మరో పర్యటన

ప్రభుత్వ స్కూళ్లలో పర్యటించిన తెలంగాణ విద్యాకమిషన్ ఇక కళాశాలపై ఫోకస్ పెట్టబోతుంది. త్వరలో మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నట్టు కమిషన్‌లోని ఓ సభ్యుడు తెలిపారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించాక కమిషన్ సమావేశమై చర్చించి కళాశాలల పర్యటనపై నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.

ఇది నిరంతర ప్రక్రియ అని, ప్రభుత్వ ఆదేశానుసారం విద్యావ్యవస్థలో సమగ్ర మార్పులు తీసుకొచ్చేందుకే కమిషన్ విద్యపై ఫోకస్ పెట్టినట్లు చెప్పారు. ఈక్రమంలోనే కళాశాల విద్యపై సైతం ఓ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సిఫార్సులు చేయనున్నారు. ఇలా పాఠశాల విద్య, కళాశాల విద్య, సాంకేతిక విద్యాభివృద్ధికి సంబంధించి వేర్వేరు నివేదికలను ప్రభుత్వానికి కమిషన్ సమర్పించనుంది.

ఆతర్వాత కమిషన్ చేసిన సిఫార్సుల అమలుకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోనుంది. పాఠశాల విద్యపై అందించే నివేదికలోని సిఫార్సులను ఈ అసెంబ్లీ సమావేశాల్లో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.