calender_icon.png 30 October, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోండి పరిరక్షకుడు కైలాష్

26-10-2025 12:00:00 AM

  1. అంతరించిపోతున్న భాషకు జీవం పోస్తున్న గోండు ఉపాధ్యాయుడు
  2. తన రచనలకు ప్రముఖుల ప్రశంసలు
  3. నేడు గవర్నర్ చేతుల మీదుగా సుందరకాండ(సోభత ఖడి) ఆవిష్కరణ

అంతరించిపోతున్న భాషల్లో గోండి కూడా ఒకటి. తమ జాతి భాషలో మాట్లాడమే సిగ్గుచేటుగా భావిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆ భాషలోని మాధుర్యాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.. ఓ గొండు ఉపాధ్యాయుడు. గోండి భాషలోని మధురమైన పదాలతో రూపొందించిన ఎన్నో పాటలు తమ జాతి వారినే కాకుండా ఇతర జాతుల వారిని ఎంతగానో ఆకట్టుకునేలా జీవం పోస్తున్నాడు.. తొడసం కైలాష్.

మహాభారతం, సుందరకాండ వంటి రచనలను తమ గోండి భాషలో అనువదించి ప్రముఖులచే ప్రశంసలు అందుకుంటున్నాడు. తాజాగా సుందరకాండను తమ గోండి భాషలో ‘సోభత ఖడి‘పేరిట అనువదించిన పుస్తకాన్ని ఆదివారం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. 

ఆదిలాబాద్ జిల్లాలోని మావల మండలం వాఘాపూర్ గ్రామ వాస్తవ్యులు తొడసం కైలాష్ ఇంద్రవెల్లి మండలంలోని గౌరాపూర్ ప్రభుత్వ ప్రాథమి కోన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2018 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సైతం అందుకున్నారు. ఆయన గతంలో మహాభారతం కావ్యాన్ని కేవలం నాలుగు నెలల్లోనే గోండి భాషలో అనువదించారు.

అది కూడా తన మొబైల్ ఫోన్‌లోనే టైప్ చేసి మొట్ట మొదట సారిగా గోండి భాషలో మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలను పండోక్న మహాభారత్ కథ పేరుతో అనువదించి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ఎంఎస్ రామారావు రచించి, గానం చేసిన సుందరకాండను గోండి భాషలో ‘సోభత ఖడి’ ని పాటల రూపంలో కేవలం 45 రోజుల్లోనే రచించారు.

తొడసం కైలాష్ ఈ సుందరకాండ కావ్యంలో ఉన్న సంస్కృత పదాలను గ్రాంథిక పదాలను అర్థం చేసుకోవడానికి శబ్ద రత్నావళి అనే తెలుగు డిక్షనరీ కొనడంతో పాటు గూగుల్ సహాయంతో పదాలను అర్థం చేసుకుని గోండి భాషలోకి అనువదించారు. 

తండ్రి అనువాదం.. 

కుమారుడు పాటల స్వరకర్త

తొడసం కైలాష్ బడికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాక రాత్రి పది గంటల వరకు కంప్యూటర్ ముందు తన విలువైన సమయాన్ని కేటాయించి స్వయంగా తనే టైప్ చేశారు. రచించడమే కాకుండా వాటిని పాటల రూపంలో కూడా తీసుకువచ్చారు. దీని కొరకు కైలాస్ తన కుమారుడు తొడసం సృజన్ రామ్ సహాయం తీసుకున్నారు. ఈ సోభత ఖడిని ఒక వైపు అనువాదం చేస్తూనే పాటలు తయారు చేసే బాధ్యతను తన కుమారుడు సృజన్‌రామ్‌కి అప్పగించారు. సృజన్‌రామ్ పాటలను కృత్రిమ మేధస్సుతో చాలా చక్కగా స్వరపరిచారు.  కైలాస్ ఆ పాటలను తన యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేయడంతో ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది.

గోండిలోకి అనువదించిన పుస్తకాలు

తొడసం కైలాష్ గోండి భాషలో ఎన్నో పుస్తకాలను అనువదించారు. తొలుతగా చిన్నపిల్లల కోసం గోండి భాషలో చిన్నపిల్లల కథల పుస్తకాలను రచించారు. అందులోనే ‘కాండిరంగ్ వేసుడింగ్’ అనంతరం  మహాభారతాన్ని అనువదించి  ‘పండోక్న మహాభారత్ కథ’ ను రచించారు. అంతటితో ఆగకుండా ప్రస్తుతం టెక్నాలజీని ఉపయోగిస్తూ తన స్వీయ ఆత్మ కథను ‘అడవి నుంచి ఏఐ వైపునకు అడుగులు’ను   ఇంగ్ల్లిష్‌లో కూడా రచించారు. తాజాగా ఇప్పుడు సుందరకాండను గోండి భాషలో ‘సోభత ఖడి‘  నీ అనువదించాడు. ఎంఎస్ రామారావ్ గానం చేసిన పాటలు హిందోళరాగంలో ఉండడంతో ఇలాంటి పాటలు గోండి  భాషలో ఉంటే బాగుంటుందనుకుని కేవలం నలభై అయిదు రోజుల్లోనే సోభత ఖడిని రాయడం పూర్తి చేశారు.

ప్రముఖుల నుంచి ప్రశంసలు

అంతరించిపోతున్న గోండు భాషను పరిరక్షించేందుకు తొడసం కైలాస్ చేస్తున్న కృషికి పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి  ద్రౌపతి ముర్ము, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు.2019లో మాజీ సీఎం రోశయ్యతో ఉత్తమ సేవ పురస్కారం అందుకున్నారు.  

 ఆదిలాబాద్, విజయక్రాంతి

మధురమైన పదాలు ఉంటాయి

గోండి భాషలో ఎంతో మధురమైన పదాలు ఉంటాయి. వాటిని ఉపయోగిస్తూ భక్తి పాటలు, ఇతరత్రా తమ సంస్కృతిని కాపాడే పాటలను రూపొందించా. నేటి యువత పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి తమ గోండి భాషలో మాట్లాడడమే సిగ్గుచేటుగా భావించే తరుణంలో మళ్లీ భాషను ప్రాచుర్యం తేవాలనుకున్నా. మధురమైన పదాలతో రూపొందించిన ఎన్నో గోండి పాటలు ఇప్పుడు తమ జాతి ప్రజలతో పాటు, ఇతర జాతుల ప్రజలను సైతం ఆకర్షిస్తున్నాయి. 

 తొడసం కైలాస్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, రచయిత