calender_icon.png 30 October, 2025 | 7:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తశాసనాలు చరిత్రమార్పునకు ఆధారం

26-10-2025 12:00:00 AM

  1. చారిత్రక ఆధారాలు లభిస్తే  కొత్తగా చరిత్ర రాయాల్సిందే..
  2. తెలంగాణ చరిత్ర బృందం ఎవరినీ సమర్థించలేదు.. వ్యతిరేకించలేదు

* చరిత్ర ఎప్పుడూ పరిణామశీలమైనదే. పాతుకున్న కొండకాదు.. డాగ్మటిజం కాదు.. కొత్త శాసనాలు బయటపడితే పాతశాసనాల సంగతులు మార్చుకోవాలె. అది చరిత్ర.  కోటిలింగాలలో తవ్వకాలు జరుపకముందు శాతవాహనుల గురించి రాసిన రాతలు, ఆ తవ్వకాల్లో బయటపడ్డ నాణేలు, పురావస్తువులు, నిర్మాణాలు, స్థూపాలు, శాసనాలు చూసిన తర్వాత చరిత్రకారులు కొత్తగా చరిత్రరాయలేదా? డిడి కోసంబి కూడా సాతవాహనులు పాలించిన అస్మక జానపదం అశ్వక కావచ్చునని వాయవ్యభారతం వైపు చూపించాడు. తానిపుడుంటే తను రాసిన దానిని నిజాయితీగా మార్చుకునేవాడు. 

విష్ణుకుండిన మహారాజు గోవిందవర్మ ఇంద్రపాలనగర శాసనంలో పేర్కొన్న ద్వావేర్మేదల పేణ్కపర అనే రెండు దానగ్రామాల పేర్లలో ఎర్మేదల అనే ఊరు విజయవాడ సమీపంలోని యనమాదలగా పేర్కొన్నారు చరిత్రకారులు. కాని, ప్రస్తుత యాదాద్రి -భువనగిరి జిల్లా గుండాల మం డలంలోని వెల్మజాలలో లభించిన రాష్ట్రకూట శాసనంలో ఆ ఊరిపేరు ఎర్మదేల అని రెండుసార్లు పేర్కొనబడింది. (కొత్త తెలంగాణ శాసనాలు, 9వ శా. పే.31) పేన్కపర మోత్కూరు పక్కన ఉన్న గ్రామం.

చరిత్రలో శంకరగండరస అనే రాష్ట్రకూటరాజప్రతినిధి పేరున దు శాసనాలు (నల్లగొండ, వరంగల్ పాతజిల్లాల్లో) లభించాయి. కానీ, నల్లగొండ జిల్లా ఆమనగల్లులోని శాసనాన్ని పరిష్కరించినాకనే అతని పరిపాలనాకాలం క్రీ.శ.888సం. అని తెలిసింది. (కొత్త తెలంగాణ శాసనాలు, 7వ శా.పే.24) ఆ పేరుతో వేర్వేరు కాలాలకు చెందిన ముగ్గురు శంకరగండరసలున్నారు. ఇపుడు ఆ పాత చరిత్రే ఆపాతమధురం అంటామా, మార్చుకుంటామా? 

కాకర్తి ఏడ?

కోదాడలో దొరికిన తొమ్మిది తామ్రశాసనాల్లో పేర్కొన్న 12గ్రామాలు నాలుగు ఉపగ్రామాలు, 77 సరిహద్దు గ్రామాలను అన్వేషించే పనిచేయాలె. ప్రస్తుతానికి తెలిసిన గ్రామా లన్నీ సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోనే ఉన్నాయి. వరంగల్ జిల్లా గ్రామాలేవీ దొరకలేదు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర-సంస్కృతి సంపుటాలలో ‘మధ్యయుగ ఆంధ్రదేశం’ (క్రీ.శ. 1000- 1324)సంపుటి, పే.108లో, నల్లగొండ జిల్లా 2వ శాసనసంపుటి, శా.సం. 25 క్రీ.శ.1149నాటి శాసనంలో ప్రస్తావించబడ్డ కొండపల్లినాడు నేలకొండపల్లి మండలం కూడివున్నటువంటిది.

ఈ విభాగం కందూరు చోడుల సిరికొండ రాజ్యంలో భాగంగా ఉండేదని తెలుపబడింది. కాకర్తి కొండపల్లి విషయంలో ఉన్నది. అది ఎక్కడుందో వెతకాల్సి వుంది. ఇందులో వరంగల్ జిల్లా ముచ్చటేది? డా. అంబటి శ్రీనివాసరాజుగారు ’మనకాకతీయులు’లో పేర్కొన్నట్టుగా కాకతిపురం కట్రియాల, కక్కిరాలపల్లి కావాలన్నది రూలేమీ కాదు.

కోదాడ శాసనాల్లో ఏముంది?

కోదాడ శాసనాల్లో గుండన ‘కాకత్యాహ్వయ’ గుండననే పేర్కొనబడ్డాడు. కోదాడలో దొరికిన 2వ తామ్రశాసనంలో విగ్రహవెట్టి మనవడు, సకలశ్రీ కొడుకు కొండపల్లి విషయాధికారి (రాష్ట్రకూటుడు) గుండ శ్రీసకలేశ్వర పేరుమీద ‘కాకర్తి’లో శివాలయ నిర్మాణం చేసినట్లు చెప్పబడింది. కొండపల్లి విషయంలోని కాకర్తిలో గుండేశ్వర భట్టారకదేవాలయం ఉన్నట్టు తెలిపే 3వ తామ్రశాసనం క్రీ.శ. 921 సెప్టెంబర్ 2న అమ్మరాజు వేయించినది.

తండ్రి ఎర్రయాదిలో గుండయ ఏరీశ్వరభట్టారక గుడిని కట్టించాడని చెప్తున్న 4వ రాగిరేకుల శాసనం క్రీ.శ.921 ఏప్రిల్‌లో వేయబడ్డది. 1వ భీముడు వేయించిన 5వ తామ్రశాసనంలో సామంతపెట్టి కుటుంబ ప్రశస్తితో పాటు తాలపునితో యుద్ధంలో మరణించిన కొండపల్లి ఏలిక 2వ గుండయ భార్య లోకమాంబకు కోవూరు అగ్రహారమివ్వబడ్డట్లు చెప్పబడ్డది. 2వ విక్రమాదిత్యుడు మనుమ (3వ) గుండయ్యకు కొడజేను (కోదాడ) గ్రామాన్ని పన్ను రహితంగా దానంచేసాడని తెలిపే 6వ శాసనం క్రీ.శ.927 ఫిబ్రవరి 24న వేసినది.

9వ తామ్రశాసనంవల్ల ’కాకత్యాహ్వయ’ అని కాకతీయుల ప్రశంస, గుండకు, ఎర్రకు వారిసేవలకు బహుమానంగా గ్రామాలిచ్చినట్లు, ఎర్ర (ఎర్రయ రాష్ట్రకూట)కు గుండ, బేతియ (చద్యనాంబ భర్త), గొనగ అనే కొడుకులున్నట్టు తెలుస్తున్నది. మాంగల్లు, కోదాడ తామ్రశాసనాలు దాదాపుగా తొలికాకతీయుల వంశావళిని ఒకే విధంగా చూపుతున్నాయి. విగ్రహవెట్టి, సకలశ్రీల పేర్లు కొత్తవి చరిత్రకు.

ఎర్ర, ఎర్రయ రాష్ట్రకూట, ఎర్రయ అనే పాలకునికి ముగ్గురు కొడుకులన్న కొత్త సంగతి కూడా కోదాడ శాసనాలవల్ల తెలుస్తున్నది. వీరిలో 2వ గుండన తాలపుని యుద్ధంలో ఓడించి, తాను చనిపోయాడని వుంది. ఇపుడు మనుమ (3వ)గుండయనే మనం చరిత్రలో చెప్పుకునే కాకర్త్య గుండన లేదా కాకతీయ గుండన అని నిర్ధారితమౌతున్నది.

తొలి కాకతీయ శాసనాలు 

పరబ్రహ్మ శాస్త్రిగారు చదివిన మాంగల్లు శాసనం అసంపూర్ణమైనది. వారు ఆ శాసనాన్ని చాలాచోట్ల ఖాళీలను పూరించి శాసనార్థాన్ని రాబట్టారు. అది దానార్ణవుని శాసనమే కనుక అది కూడా కోదాడ శాసనాలతో సమానమైనదే. ఆ శాసనాల్లో పేర్కొన్న కాలం ఒకసారి 921, రెండుసార్లు 927లు. పరబ్రహ్మశాస్త్రిగారు ఊహించిన కాలానికి దగ్గరగా వున్నాయి. కోదాడ శాసనాలనుబట్టి గుండనలు ముగ్గురే. వారి పూర్వీకులు ముగ్గురు.

ఆరు తరాలనందిస్తున్నవి ఈశాసనాలు. బయ్యారం శాసనంలో పేర్కొన్న పేర్లలో బేతిఇయ పేరెందుకు లేదో కారణం తెలియదు. కోదాడ శాసనాల ప్రకారం గుండయ కొండపల్లి విషయపాలకుడు, చద్యనాంబ భర్త బేతియ బొజ్జప్రోలు పాలకుడు. గొనగ గురించి గొనగశ్వజతాః అని శాసనంలో ఉంది కనుక అశ్వసాహిణి కావచ్చునన్నది ఊహ.

చరిత్ర ఎటువైపు ?

కాకతీయుల వంశావళినిచ్చిన బయ్యారం శాసనం వేయించింది మైలమాంబ. అది 13వ శతాబ్దం తొలినాళ్లలో. కోదాడ శాసనాలు 921-,927 నాటివి. వేటిని ప్రాథమ్యంగా గణించాలె. విగ్రహవెట్టి, సకలశ్రీ వున్నారని శాసనాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. బయ్యారం శాసనంలోని కాకతీయవంశావళికి చేర్పులు, మార్పులు తప్పనిసరి. ఊహాత్మక కథనాలకు, యదార్థనిరూపణలకు నడుమ చరిత్ర ఎటువైపు నిలుస్తుంది?

వెన్ననృపతి ఎప్పటివాడు?

తన సైన్యంతో దంతిదుర్గునితో కలిసి బాదామీకళ్యాణీ చాళుక్యులను ఓడించడంలో, రాష్ట్రకూటరాజ్య స్థాపనలో సాయపడ్డాడంటే కాకతీయ వంశస్థాపకుడు వెన్ననృపుడెప్పటివాడు. కాని, దంతిదుర్గుడు క్రీ.శ. 756లో మరణించాడు. వెన్నడు క్రీ.శ. 800సం.లో ఉండవచ్చని పరబ్రహ్మశాస్త్రి కాకతీయులులో రాసారు. అపుడు వెన్నడు మరో 50సం.లు వెనక ఉండాలి. యుద్ధమప్పటికి అతని వయసెంత? మరి వీరెట్లా కలిసారని చరిత్రకారుడు నిర్ధారణ చేసారు.

కోదాడ శాసనాలు రాజవంశీయులు వేయించిన శాసనాలే పరబ్రహ్మశాస్త్రిగారు ‘కాకతీయులు’ రాయడానికి ఆధారమైనవి, మరెవరైనా రాయడానికి తోడ్పడ్డవి ఇంతకు ముందుదాక లభించిన శాసన, సాహిత్యాధారాలు, కొంత చరిత్రకారుల విచక్షణ. ఇంత పెద్ద ఎత్తున కోదాడలో ఒకేచోట ఇన్ని రాగిరేకుల శాసనాలు లభించడం అపూర్వం.

ఇవి ఎక్కడో, ఏవో దొరికించుకున్న శాసనాలు కావు. ఇవి రాజశాసనాలే. వేరెవరో వేయించినవి కావు. వాటి మీద వేంగీరాజ్యపాలకుల రాజలాంఛనాలున్నాయి. మరి ఇవి రాజవంశీకుల శాసనాలు కావా? అబద్ధపు, కూట శాసనాలా? సందేహించిన చరిత్రకారులు నిరూపణకు పూనుకుంటే చరిత్రకు మేలు జరుగుతుంది. వారికి సాదర స్వాగతం.

కాకతీయులు తొలుత వెట్టి అధికారులే..

కాకతీయులు వెట్టి అధికారం చేసినవారే. మాంగల్లు శాసనం ‘సామంతవొద్ది’, ఖాజీపేట శాసనం సామంతపెట్టి, కోదాడ శాసనాలు వెట్టి(విగ్రహవెట్టి పేరు) అని వారి పేర్లతో వెట్టి చేర్చి పేర్కొన్నారు.  -బైరాంపల్లి శాసనంలో మల్లారెడ్డిని ’బ్రెక్కల్ల బిట్టకులతిలక’ అని రెండుసార్లు, బైరాంపల్లి శాసనంలో కూడా ‘బిట్టకులతిలక’ అని ఒకసారి సంబోధించడం జరిగింది.

బిట్ట, విట్ట, విట్టి, వెట్టి పర్యాయపదాలుగానే వాడబడ్డవి. వెట్టి అధికారులు ఎవరు, ఏం చేస్తారనేదానికి కౌటిల్యుని అర్థశాస్త్రంలో కూడా వివరణ లభిస్తుంది. విష్టి పన్ను వసూలు చేసే రాష్ట్రకూట పాలనా యంత్రాంగం ఉన్నతాధికారులు తమ కుటుంబాలను ’విష్టి’ పేరుతో పిల్చుకున్నారు. (ఐఏపీ, వరంగల్:ఆకునూరు(3వ) శాసనంలో విట్టి నారాయణ,పే.7)

కాకతీయ శాసనాలు ఎన్ని?

ఇప్పటిదాక దొరికిన కాకతీయ శాసనాలు ఐసీహెచ్‌ఆర్ కాకతీయుల శాసనాల సంకలనంలో 367, అదనంగా నాతోపాటు, ఇతర శాసనవేత్తలు పరిష్కరించినవి 50దాకా ఉండొచ్చు. అన్నీ 420 దాటుతాయి. వేల కాకతీయ శాసనాలెక్కడున్నాయోమరి.

అర్థమయ్యేటట్లు చెప్పాలనే..

మా చరిత్రబృందం ‘తెలంగాణ చరిత్రబృంద’ మనే పేరుకు ‘కొత్త’ అనే విశేషణాన్ని చేర్చుకున్నదే తప్ప తెలంగాణ చరిత్రను కొత్తగా రాస్తామంటూ బయలుదేరలేదు. కానీ, చారిత్రకాధారాలు కొత్తగా లభించినపుడు కొత్తగా చరిత్ర రాయాల్సి ఉంటుందన్న ఇంగితంతోనే పనిచేస్తున్నది మా బృందం. ఎవరినీ సమర్థించలేదు, వ్యతిరేకించలేదు. ఆ పనులు చేస్తున్న వారికి అర్థమయేటట్లు చెప్పాలన్నదే మా ప్రయత్నం. 1