27-11-2025 12:38:23 AM
కొత్తకోట నవంబర్ 26 కొత్తకోట పట్టణంలో అయ్యప్ప స్వాములు భక్తిశ్రద్ధలతో కలశ పూజా కార్యక్రమాలు నిర్వహించి, అంబా భవాని దేవాలయం నుంచి త్వరలో నిర్మించబోయే అయ్యప్ప దేవస్థానం వరకు ప్రత్యేక పాదయాత్రగా ఊరేగింపు నిర్వహించారు. పట్టణ ప్రధాన వీధులంతా స్వామి శరణం అయ్యప్ప నినాదాలతో మార్మోగగా, భక్తులు మంగళ వాద్యాలు, దీపాల తేజస్సుతో శోభాయమానంగా పాల్గొన్నారు.
పలువురు అయ్యప్ప మాలధారులు పరుషరామపతం వేస్తూ, కఠిన నియమాలు పాటిస్తూ, స్వామివారి సేవలో తాము సమర్పించుకున్నట్లు భక్తి పరవశంతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు వీధిరద్దీగా నిల్చొని ఊరేగింపును దర్శించి పూల వర్షం కురిపిస్తూ అయ్యప్ప స్వామికి నమస్కారాలు సమర్పించారు. సర్వత్రా భక్తి, శ్రద్ధలతో నిర్వహించిన ఈ అయ్యప్ప పాదయాత్ర పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.