calender_icon.png 24 September, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమీషన్ కోసమే కాళేశ్వరం రీడిజైన్

24-09-2025 12:39:42 AM

- సిద్దిపేటలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

సిద్దిపేట, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): కమిషన్ల కకృతి కోసం కాలేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసి నిర్మించారని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కాలేశ్వరానికి బదులుగా తక్కువ ఖర్చుతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు (తుమ్మిడిహెట్టి వద్ద) ద్వారా నీరందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. మంగళవారం సిద్దిపేట పట్టణం 37వ వార్డు అంబేద్కర్ నగర్, సిద్దిపేట అర్బన్ మండలంలోని ఎన్సాన్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు.

లబ్ధిదారులతో మాట్లాడి వారిని సన్మానించిన ఆయన, ఎన్సాన్ పల్లిలో లబ్ధిదారులతో కలిసి సహభోజనం కూడా చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ నిరుపేదల ముఖంలో ఆనందం చూడటం సంతోషాన్ని కలిగిస్తోందని, పారదర్శకంగా ఎంపిక చేసిన లబ్ధిదారులు నాణ్యతతో ఇండ్లు నిర్మించుకుంటున్నారనీ చెప్పారు. 37వ వార్డులో 78 ఇండ్లు, ఎన్సాన్ పల్లిలో 127 ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి బిల్లులు ఆటోమేటిక్గా జమ అవుతున్నాయని, బేస్మెంట్కు రూ.1 లక్ష, గోడ పూర్తయ్యాక మరో లక్ష, స్లాబు వేసుకున్నాక రూ.2 లక్షలు, చివరగా మరో లక్ష విడుదలవుతాయి అన్నారు. 600 చదరపు అడుగుల లోపే ఇండ్లు నిర్మించుకోవాలని, ఎక్కువ స్థలంలో నిర్మిస్తే బిల్లులు రాకపోవచ్చని సూచించారు. గడిచిన దశాబ్దంలో పేదలకు సొంతింటి కల నెరవేరలేదని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వచ్చిన అర్జీలలో 70 శాతం ఇందిరమ్మ ఇళ్లు కోరుతున్నారని తెలిపారు. ఇసుక కొరత రాకుండా మైనింగ్ డిపార్ట్మెంట్తో చర్చించి సిద్దిపేటలో ఇసుక బజారును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.