24-09-2025 12:39:47 AM
జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన కేబీఆర్ పార్కు ప్రాజెక్టు పనులను, ముఖ్యంగా భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం కమిషనర్ ఆర్.వి. కర్ణన్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి, జూబ్లీహిల్స్ డిప్యూటీ కమిషనర్ వి. సమ్మయ్యలతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నెం. 2 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు కేబీఆర్ పార్కు ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ కర్ణన్ ప్రాజెక్టు పనుల ప్రారంభానికి సంబంధించి జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను వేగంగా చేపట్టడమే కాకుండా, నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.
ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలి
నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు దూరం చేసేందుకు చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ, హెచ్ సిటీ పనుల్లో వేగం పెంచాలని కమిషనర్ కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ హెడ్ ఆఫీస్‌లో మంగళవారం నగరంలోని అన్ని జోన్ లలో చేపడుతున్న ఎస్‌ఎన్‌డీపీ, హెచ్‌సిటీ ప్రాజెక్టులు, స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రామ్, లేక్‌ల అభివృధి, స్టార్మ్ వాటర్ డ్రైన్ పనుల పురోగతిపై జోనల్ కమిషనర్‌లు, ప్రాజెక్టుల ఇంజనీర్‌లు, ప్లానింగ్, ఇరిగేషన్, భూ సేకరణ అధి కారులతో సమీక్ష నిర్వహించారు.
6 జోనల్ ల పరిధిలో లేక్ ల అభివృద్ధిలో భాగంగా 83 పనులు చేపట్టగా 25 పనులు మాత్రమే ప్రారంభం కావడం, లేక్స్ అభివృద్ధి, పునరుద్ధరణ పనులు స్లో గా జరగడంపై కమిషనర్ మండిపడ్డారు. ఇరిగేషన్ ఇంజనీర్లు సరిగా పనిచేస్తలేరని, వారం రోజుల్లో లేక్స్ అభివృద్ధి పనులపై జోనల్ కమిషనర్ల ద్వారా క్షేత్రస్థాయి తాజా రిపోర్టు తీసుకుంటామన్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జోనల్ కమిషనర్‌లు అనురాగ్ జయంతి, హేమంత్ పాటిల్, అపూర్వ చౌహాన్, శ్రీనివాస్ రెడ్డి, రవి కిరణ్‌పాల్గొన్నారు.