09-09-2025 11:28:07 PM
ప్రొఫెసర్ బి. చంద్రమౌళి
హనుమకొండ టౌన్, (విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లి పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల(Pingle Government College for Women)లో ప్రజాకవి కాళోజీ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి. చంద్రమౌళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కాళోజీ చిత్ర పటానికి పూలమాలవేసి కాళోజీకి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ యాసకు, భాషకు గౌరవాన్ని కలిగించిన మహనీయుడు, ప్రజాకవి కాళోజీ అని నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన పోరాట యోధుడు అని, తెలంగాణ ప్రజల గుండె చప్పుడు కాళోజీ అని అభివర్ణించారు.
కార్యక్రమ నిర్వాహకుడు కళాశాల తెలుగు విభాగాధిపతి ఎస్. మధు మాట్లాడుతూ ప్రజాకవి కాళోజీ తన కవితల ద్వారా తెలంగాణ ప్రజలలో చైతన్యం తీసుకువచ్చారని, ఒక్క సిరా చుక్క ద్వారా లక్ష మెదళ్లకు కదలిక కలిగించారనీ, పుటుక నీది చావు నీది బతుకంతా దేశానిది అంటూ దేశశ్రేయస్సు కోసం బ్రతికిన తెలంగాణ ఉద్యమ నాయకుడు కాళోజీ అనీ, ఆయన కవితలు తెలంగాణ ప్రజల నాలుకలపై నర్తిస్తాయని, ఆయన జన్మదినం తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. జి.సుహాసిని, తెలుగు అధ్యాపకులు డా.లక్ష్మీకాంతం, రామారత్నమాల, ప్రొ .బి. సునీత, అధ్యాపకులు కె. రాజేశ్వరి, డా. యుగంధర్, బోధన బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ, చిత్ర లేఖనం, కవితా రచన పోటీలలో రుచిత, శృతి, నవ్య, భార్గవి, తైసిన్, తబస్సుమ్ బహుమతులు పొందారు.