09-09-2025 07:20:10 PM
వనపర్తి (విజయక్రాంతి): ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి ప్రదాత అని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) అన్నారు. బి.సి. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు 111వ జయంతి వేడుకలను నిర్వహించగా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ కాళోజీ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో అన్యాయాన్ని ఎదిరించడం, ప్రశ్నించడమే కాళోజీ నారాణరావుకు నిజమైన నివాళులు అని చెప్పారు. నిజాం నవాబు నిరంకుశానికి వ్యతిరేకంగా సామాన్య మానవునికి సైతం అర్థం అయ్యే రీతిలో ఎన్నో కవిత్వాలు రాసి ప్రజల్లో చైతన్యం నింపిన వ్యక్తి అని కొనియాడారు.
ఒక్క సిరా చుక్క..వేయి మెదళ్లకు కలయిక అనే స్ఫూర్తితో... తెలంగాణ ప్రజలను జాగృతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. కవిగా ఉంటూ ఎన్నో రచనలు రాస్తూ తెలంగాణ ప్రజలను జాగృతం చేశారని గుర్తుచేసారు. కాళోజీ నారాయణరావు నిరాడంబరుడు అని కొనియాడారు. అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ముజాహిద్ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీనివాసులు, ప్రజా సంఘాల నాయకులు గంధం నాగరాజు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు నివాళులు అర్పించిన వాటిలో ఉన్నారు.