10-09-2025 12:59:59 AM
మేడ్చల్, సెప్టెంబర్ 9 (విజయ క్రాంతి): విద్యార్థులను ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని, తద్వారా సమాజ నిర్మాతలుగా నిలిపేది కూడా ఉపాధ్యాయులేనని ఎం ఎల్ సి, ఎవిఎన్ రెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా గురుపూజ దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఎంఎల్ సి ఎవిఎన్ రెడ్డి, ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ రాధికగుప్తా, జిల్లా విద్యాశాఖాధికారి విజయకుమారి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎంఎల్సి ఎవిఎన్ రెడ్డి మాట్లాడుతూ గురువులు ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ సమాజ రూపకల్పన జరుగుతుందన్నారు. ఉత్తమ సమాజరూపకర్తలు గురువులేనన్నారు. ఏరంగంలోనైన ప్రతిభావంతులుగా రాణించాలంటే అందుకు కారణం గురువులేనన్నారు.
ఉపాధ్యాయ వృత్తి మీద సమాజం ఆధారపడి ఉంటుందని, విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దితేనే సమాజం బాగుంటుందని అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ రాధికగుప్తా మాట్లాడుతూ విద్యా పరంగా రాష్ట్ర స్థాయిలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రత్యేక స్థానంలో ఉందని, అందుకు ఉపాధ్యాయులే కారణమ న్నారు.
జిల్లాలో సుమారుగా 500 స్కూల్స్ ఉన్నాయని అందులో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే తప్పనిసరిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టీచర్స్ విద్యనందించడంతోపాటు డాటా ఎంట్రీ, ఎలక్షన్ విధులు ఇలా అనేక సందర్భాలలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ తమ సేవలందిస్తారని అన్నారు. ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను మెమోంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, సభ్యులు, టీచర్లు పాల్గొన్నారు.