13-08-2024 03:48:59 PM
కల్యాణ లక్ష్మితో పేదింటి మేనమామ అయ్యాడు కేసీఆర్
డిసెంబర్ 9 నుంచి జరిగిన పెళ్లిలన్నింటికీ తులం బంగారం ఇవ్వాలి: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మాజీ సీఎం కేసీఆర్ పేద బిడ్డల పెళ్లిల కోసం ఉన్నతంగా ఆలోచించి కల్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకుచ్చారు. ప్రతి పేద ఇంటి మేనమామ అయ్యాడని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
మంగళవారం హుజరాబాద్ నియోజకవర్గం లోని చెల్పూర్, ఇంద్రనగర్ రాజ పల్లి, రాంపూర్ రంగాపూర్ పోతిరెడ్డిపేట్, సిర్సపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. ఈసందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ... కళ్యాణ లక్ష్మి ద్వారా ఎంతోమంది పేద కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఉపశమనం కలుగుతుందన్నారు. కేసీఆర్ ఆలోచనతో కల్యాణ లక్ష్మి పథకం 50వేలతో మొదలై క్రమేపి 75 వేల నుంచి లక్ష 116 లు చేశారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీలలో భాగంగా కళ్యాణ్ లక్ష్మీ పథకం కింద లక్ష 116 లతోపాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని, లబ్ధిదారులందరికి వేంటనే అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే డిసెంబర్ 9 తర్వాత పెళ్లిళ్లు చేసుకున్న వారందరికీ ఈ పథకం కింద తులం బంగారం ఇవ్వాలని అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన సతీమణి శాలినీరెడ్డి తో కలిసి లబ్దిదారుల ఇంటికి వెళ్లి చెక్కులు పంపిణీ చేశారు. హుజురాబాద్ నియోజకవర్గం లో ఏ కుటుంబానికి కష్టం వచ్చినా నేనున్నానంటూ ఎక్కడ ఏ సమస్యనైనా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు.