calender_icon.png 7 May, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ అప్పుతో రాష్ట్ర భవిష్యత్‌కు ముప్పు

07-05-2025 01:21:01 AM

  1. సత్తా లేకనే పత్తా లేకుండా వెళ్లారు
  2. మంత్రి సీతక్క ఆగ్రహం

హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): గత పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పు కారణంగా తెలంగాణ భవిష్యత్‌కు ముప్పు దాపురించిందని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిర్వాకం వల్ల నెలకు రూ. 6 వేల కోట్ల ప్రజాధనాన్ని అప్పుల చెల్లింపుల కోసం మళ్లించాల్సి వస్తుందన్నారు. మంగళవారం సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని పాటిగడ్డలో ‘సన్నబియ్యం సంబరం’ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో స్థానిక లబ్ధిదారుడి ఇంట్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు.  సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్న బియ్యం కార్యక్రమం పేదల ఆకలి తీరుస్తుందన్నారు. కేవలం సంపన్న వర్గాలు మాత్రమే తినే సన్న బియ్యాన్ని ఉచితంగా పేద ప్రజలకు అందజేస్తున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్‌పై అనవసర వ్యాఖ్యలతో కేటీఆర్ తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.

గత ప్రభుత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని దుయ్యబట్టారు. కేసీఆర్ సత్తా ఉన్న నాయకుడే అయితే పత్తా లేకుండా ఎక్కడికి వెళ్లారో చెప్పాలన్నారు. 40 మంది ఆర్టీసీ కార్మికుల ఉసురు తీయడంతో పాటు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకుల ఇంటి తలుపులు పగులగొట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని విమర్శించారు. గత ప్రభుత్వ అప్పుల మూలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ఎక్కడా సంక్షేమానికి లోటు లేకుండా చూస్తున్నామని వెల్లడించారు.