09-08-2025 01:56:03 AM
టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్
ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డికి టీఎన్జీవోల అల్టిమేటం
బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్
మెదక్, ఆగస్టు 8 (విజయక్రాంతి) : మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌పై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని జిల్లా టీఎన్జీవో సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. గురువారం బీఆర్‌ఎస్ రైతు మహాధర్నాలో ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి కలెక్టర్‌పై పరుషపదజాలంతో దూషించడం సిగ్గుచేటని, కలెక్టర్‌కు అండగా ఉద్యోగ సంఘాలు ఉన్నాయని హెచ్చరించారు.
ఈ సందర్భంగా మెదక్ జిల్లా టిఎన్జీవోస్ యూనియన్ అధ్యక్షులు దొంత నరేందర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాల పట్ల జవాబుదారితనం పారదర్శకత లక్ష్యంగా జిల్లాలో ప్రగతి పాలన అందిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ అధికారులు రాష్ర్ట ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ సమిష్టిగా కృషి చేస్తారని, అటువంటి సమర్థవంతమైన పాలన అందిస్తున్న జిల్లా కలెక్టర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
ఇకముందు ఏ ప్రభుత్వ అధికారికైనా అన్యాయం జరిగినా, వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారికి అండగా మెదక్ జిల్లా తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ అండగా ఉండటంతో పాటు వారిని రక్షించడం జరుగుతుందన్నారు. రాజకీయాలకతీతంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో ప్రభుత్వ అధికారులు అమలు చేస్తారన్నారు. మెదక్ జిల్లా ప్రభుత్వ అధికారులు విధుల పట్ల చిత్తశుద్ధి అంకితభావంతో పనిచేస్తారని తెలిపారు.
ఇకముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ సెక్రెటరీ జనరల్ విటల్, టీఎన్జీవో సెక్రెటరీ రాజ్ కుమార్, క్లాస్ ఫోర్త్ అధ్యక్ష కార్యదర్శులు జలగం ప్రసాద్, రిజ్వాన్ అలీ, ఎస్ టి యు అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్, టి టి యు అధ్యక్షులు శివయ్య, టిఎన్జీవో జిల్లా సహాధ్యక్షులు ఇక్బాల్ పాషా, కోశాధికారి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు ఫజాలుద్దీన్, సంయుక్త కార్యదర్శులు శంకర్, శివాజీ, పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు జంగం నగేష్, గోపాల్, శ్రీ హర్ష ధనుంజయ్, జిల్లా అధికారులు, పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు.