17-09-2025 01:15:49 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్,సెప్టెంబర్16( విజయ క్రాంతి): ఆదివాసీల ఆరాధ్య దైవం కుమ్రం భీం 85వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం కెరెమెరి మండలం జోడేఘాట్ లో కుమ్రం భీం 85వ వర్ధంతిని పురస్కరించుకొని ఐటీడీఏ పిఓ ఖుష్బూగుప్త, జిల్లా ఎస్.పి. కాంతిలాల్ పాటిల్, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి,ఎమ్మెల్యే కోవ లక్ష్మి,ఏ ఎస్ పి చిత్తరంజన్, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి హెలిప్యాడ్, వర్ధంతి, దర్బార్ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేసి కుమ్రం భీమ్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో జిల్లా కలెక్టర్మా ట్లాడుతూ కుమ్రం భీం వర్ధంతి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. అక్టోబర్ 7న నిర్వహించనున్న వర్ధంతి కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, జోడేఘాట్ లో శాశ్వత సభ వేదిక నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.
భద్రత దృష్ట్యా సి.సి. కెమెరాలను ఏర్పాటు చేయాలని, వేడుకలకు వచ్చే ప్రజలకు భోజనం, త్రాగునీరు ఏర్పాటు చేయాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, పారిశుధ్య కార్యక్రమాలు పకడ్బందీగా చేపట్టాలని, హట్టి నుండి జోడేఘాట్ వరకు అవసరమైన బస్ లను నడపాలని ఆర్.టి.సి. అధికారులను ఆదేశించారు.
సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ద్వారా గిరిజనులకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై శాఖల వారిగా స్టాళ్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గిరిజన ప్రజల సమస్యల ధరఖాస్తులను నమోదు చేసుకునేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తామని, దర్బార్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు.
వర్ధంతి వేడుకలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలతో పాటు చత్తీస్ గడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో గిరిజనులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.కోవ లక్ష్మి మాట్లాడుతూ జల్- జంగల్ - జమీన్ కోసం పోరాడిన కుమ్రం భీమ్ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వంఆదివాసి గ్రామాలు, గూడాలలో నివాస గృహాలు, త్రాగునీటి పనులను వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. వర్ధంతి వేడుకలలో భాగంగా పార్కింగ్ కొరకు వినియోగించే వ్యవసాయ భూమికి నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని,
జోడేఘాట్ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు, స్థానిక గిరిజన ప్రజల కొరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను నిర్మించాలని తెలిపారు. టూరిజం ఏర్పాటు చేయాలని, వర్ధంతి ఉత్సవానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, అందరి సహకారంతో వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో ఈ.ఈ. తనాజీ, అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి కుడ్మేత మనోహర్, వివిధ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు పెందోర్ రాజేశ్వర్, రాయి సెంటర్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.