30-01-2026 12:43:41 AM
ప్రభుత్వ తీరుపై సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహారెడ్డి ధ్వజం
ఆమనగల్లు, జనవరి 29(విజయక్రాంతి): మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సిట్ (SIT) నోటీసులు జారీ చేయడం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యేనని సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహారెడ్డి విమర్శించారు. గురువారం ఆమనగల్ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నాయకులను వేధించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ నిర్మాతగా, అభివృద్ధి ప్రదాతగా కేసీఆర్కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధమైన నోటీసుల పర్వానికి తెరలేపిందని ఆయన ఆరోపించారు.
సిట్ విచారణల పేరుతో కాలయాపన చేస్తూ, నిజాలను పక్కన పెట్టి కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలని చూడటం ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. రాజకీయ వేధింపులపై చూపే శ్రద్ధను ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై చూపాలని డిమాండ్ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఉద్యమ స్ఫూర్తిని అణచివేయలేరు. ఇలాంటి వికృత చేష్టలకు ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు పంతు నాయక్, చుక్కా నిరంజన్ గౌడ్, ఆనంతుల సైదులు, వెంకటేష్, చక్రి, అహ్మద్, సోహైల్ తదితరులు పాల్గొన్నారు.