calender_icon.png 30 December, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టసభలు ప్రజాస్వామ్యానికి ప్రతీక

30-12-2025 01:19:05 AM

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, డిసెంబర్  29 (విజయక్రాంతి): శాసన మండలి, శాసనసభ రెండు చట్టసభలు ప్రజాస్వామ్యానికి ప్రతీకలని సభ్యుల ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి, మంత్రులపై ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సభలు జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని, పారదర్శకంగా, వేగంగా మంత్రులకు, సభ్యులకు సమాచారం అందించాల్సి ఉంటుందన్నారు.

అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్‌లో సోమవారం మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబుతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ అ త్యంత ప్రజాస్వామికంగా సభ జరపాలని ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచన చేస్తోందన్నారు. ప్రజలకు, సభ్యులకు జవాబు దారీగా.. దృఢ సంకల్పంతో ప్రజాప్రభుత్వం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలు అత్యంత పవిత్రమైనవి.. ఈ సభకు సభ్యులు గొప్ప ఆశయాలు, లక్ష్యాలతో వస్తున్నారన్న విషయాన్ని అధికార యంత్రాంగం గుర్తించాలని తెలిపారు.  ప్రజల సమస్యలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏదో ఒక సమాధానం రాబట్టాలన్న ఆలోచనలతో సభ్యులు ఉంటారు. కాబట్టి అధికారులు అన్ని ప్రశ్నలకు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలన్నారు.

సభ జరిగే సమయంలో లైవ్ ప్రసారాల ద్వారా సభను రాష్ట్రంలోని ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నవారు ఆసక్తిగా చూస్తారని,  ఉభయ సభల సమాచారాన్ని అధికారికంగా ధ్రువీక రించుకోకుండా మీడియాలో ప్రసారం చేస్తే, చట్టసభల హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు. 

సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామ కృష్ణారావు, కౌన్సిల్ సెక్రటరీ నరసింహ చార్యులు, అసెంబ్లీ సెక్రటరీ తిరుపతి సీనియర్ అధికారులు వికాస్ రాజ్, దాన కిషోర్, జయేష్ రంజన్, రఘునందన్ రావు, శ్రీధర్, నదీమ్‌అహ్మద్, శైలజరమా అయ్యర్, యోగితారానా, లోకేష్‌కుమార్ పాల్గొన్నారు. 

చట్టసభల గౌరవాన్ని, ఔన్నత్యాన్ని పెంచుదాం: మంత్రి శ్రీధర్ బాబు

చట్టసభల గౌరవాన్ని, ఔన్నత్యాన్ని పెంచేలా ఉభయ సభలు నిర్వహించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందని అందుకు అధికారుల నుంచి సంపూర్ణ సహకారం ఉండాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. ప్రతిరోజు ఉదయాన్నే మీడియాలో వచ్చిన వివిధ అంశాల సమాచారాన్ని సేకరించాలన్నారు. సభ్యులు ప్రశ్నలు లేవనెత్తితే అధికారులు పూర్తి సమాచారంతో అందుబాటులో ఉండాలన్నారు. జీరో అవర్‌లో సభ్యుల ప్రశ్నలకు అవసరమైన సమాచారంతో సిద్ధం చేయాల ని, పెండింగ్ రిపోర్ట్స్, హామీలకు సంబంధించి సమగ్ర డాటా సిద్ధంగా ఉండాలన్నారు.

కేసీఆర్‌ను ఆరోగ్యం ఎలా ఉందని అడిగా: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

‘కేసీఆర్‌ను ఆరోగ్యం ఎలా ఉందని అడిగా. బావుందని చెప్పారు. నా ఆరోగ్యం గురించి కూడా అడిగారు.. బావుందని చెప్పా’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీలో మంత్రి కోమటిరెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపితే సభలో లేకుండా కేసీఆర్ వెళ్లిపోవడం సరైంది కాదన్నారు. మౌనం పాటించిన తర్వాత కేసీఆర్ వెళ్లితే బాగుండేదన్నారు.