calender_icon.png 30 December, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం గాలిసోకి ‘ఉత్త’మాటలు

30-12-2025 01:15:48 AM

  1. ఆయనకు రేవంత్‌రెడ్డి సహవాస దోషం పట్టుకుంది
  2. ‘పాలమూరు’ కోసం నేల మీద పడుకుని పనిచేశా
  3. పాలమూరు ద్రోహులు కాంగ్రెస్ నేతలు
  4. సొంత శాఖపై మంత్రిగా ఉత్తమ్‌కు ఇంకా పట్టు రాలేదు
  5. అసెంబ్లీ చిట్‌చాట్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి) : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి గాలి సోకినట్టుందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఆయనకు రేవంత్‌రెడ్డి సహవాస దోషం పట్టుకుందని, అందుకే ఉత్త మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సోమవారం అసెంబ్లీలో మీడియాతో హరీశ్‌రావు చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజక్టు కోసం నేల మీద పడుకుని పనిచేశానని, ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని గుర్తు చేశారు.

90 టీఎంసీలను 45 టీఎంసీలకు తగ్గించారా లేదా? ఉత్తమ్ చెప్పాలని డిమాండ్ చేశారు. డీపీఆర్ వాపస్ వచ్చి ఏడాది అయినా మౌనం ఎందుకు అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హాయాంలో ఏడు అనుమతులు తీసుకొచ్చామని, రెండేళ్లల్లో ఒక్క అనుమతి అయినా తీసుకొచ్చారా అని నిలదీశారు. పాలమూరు ద్రోహులు కాంగ్రెస్ నేతలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్‌లో, కోర్టులో కేసు వేసి అడ్డుకున్న ద్రోహి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అని మండిపడ్డారు. రెండు టన్నెళ్లు బీఆర్‌ఎస్ హయాంలోనే పూర్తి అయ్యాయని స్పష్టం చేశారు.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతకాని తనాన్ని మాపై రుద్దుతున్నారని ఆరోపించారు. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్‌కు రెండేళ్ల క్రితం కొబ్బరికాయ కొట్టి డీపీఆర్ ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. సొంత శాఖపై మంత్రిగా ఉత్తమ్‌కు ఇంకా పట్టు రానట్టుందని, ఇంకెప్పుడు జ్ఞానం పెంచుకుంటారో అని అన్నారు. ఎస్‌ఎల్బీసీపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.1900కోట్లు ఖర్చు పెట్టిందని, ఏడు ప్రాజెక్టులకు ఢిల్లీ నుంచి ఫైనల్ అనుమతులు తీసుకొచ్చామని తెలిపారు.

కాంగ్రెస్ హయాంలో 3 డీపీఆర్‌లు వాపస్ వచ్చాయని, రెండేళ్లలో ఉత్తమ్ ఒక్క అనుమతి కూడా తీసుకురాలేదన్నారు. సభను కనీసం 15 రోజులు జరపాలని బీఏసీలో పట్టు పట్టామని వెల్లడించారు. వారం రోజులు జరుపుతామని స్పీకర్ చెప్పారని, వారం తర్వాత మళ్లీ బీఏసీ పిలుస్తామన్నారని పేర్కొన్నారు.

నదీ జాలాలపై సభలో బీఆర్‌ఎస్ కూడా పీపీటీకి అవకాశం ఇవ్వాలని బీఏసీలో లేవనెత్తామని, కాంగ్రెస్ వచ్చాక క్వశ్చన్ అవర్ 6 రోజులు మాత్రమే పెట్టారని, ప్రతి రోజూ క్వశ్చన్ అవర్ పెట్టాలని కోరినట్టు చెప్పారు. ఖాళీగా ఉన్న 16 హౌస్ కమిటీలు వేయాలని కోరామని, ఎజెండా పంపే పద్ధతి సరిగా లేదని, 24 గంటల ముందే అజెండా ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.