calender_icon.png 8 November, 2025 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ సరస్వతి శిశు మందిరంలో ఘనంగా సప్తశక్తి సంఘం

08-11-2025 07:18:42 PM

హనుమకొండ,(విజయక్రాంతి): పద్మాక్షి కాలనీలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో శనివారం ఉదయం  సప్తశక్తి సంగం అనే పేరుతో మహిళల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ మహిళా వైద్యురాలు, రాష్ట్ర సేవికాసమితి నాయకురాలు డాక్టర్ మాగంటి అరుణ అధ్యక్షత వహించగా రిటైర్డ్ ఏఏంఓ బోయినపల్లి రాధ, రిటైర్డ్ టీచర్ సందివెన మంజుల వాణి ప్రధాన వక్తలుగా విచ్చేశారు.

ముందుగా బోయినపల్లి రాధ మాట్లాడుతూ... భారతదేశ ఉన్నతిలో మహిళల పాత్ర అమూల్యం అన్నారు. హద్దులు లేని వాత్సల్యాన్ని చూపించే స్వభావాన్ని మాతృత్వం అంటారని, మాతృత్వ భావన కలిగిన అన్ని తత్వాలను తల్లి అంటారని అన్నారు. అనంతరం మంజుల వాణి మాట్లాడుతూ భారతీయ జీవన వ్యవస్థలో నాలుగు ఆశ్రమ ధర్మాలు ఉన్నాయని వాటి యొక్క పునాది భారతీయ కుటుంబ వ్యవస్థలో వున్నదని అన్నారు. కుటుంబాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మహిళలపై ఉందన్నారు. మహిళలు పర్యావరణ స్పృహ కలిగి,ప్లాస్టిక్ కు దూరంగా ఉండాలని ఆమె సూచించారు.

ముఖ్య అతిధి డాక్టర్ మాగంటి అరుణ మాట్లాడుతూ పిల్లలయొక్క మనసులో ఇంటి పనుల పట్ల గౌరవాన్ని, అందరితో కలిసి సహజంగా భోజనం చేయాలనే భావనను పెద్దలు కలుగజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతీ శిశు మందిర్ ప్రధాన ఆచార్యులు ఊకంటి మున్నెమ్మ, ఆచార్యులు, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు, హితయిషులు, ప్రబంధకారీ సభ్యులు, ఇతర పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.