03-07-2025 11:00:00 PM
గ్రామ స్థాయి కార్యకర్తలతో వినూత్న రీతిలో సమావేశం ఏర్పాటు శుభపరిణామం..
హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్ భవన్‌లో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు, పశ్చిమ వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) ఆదేశాల మేరకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా జరుగనున్న సంవిధాన్ పరిరక్షణ శంఖారావం సభ విజయవంతంగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కార్యకర్తలతో సమావేశమవనున్నారు. ఈ వినూత్న కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, కార్యకర్తలకు నూతన స్పూర్తిని అందించడానికీ దోహదపడనుందని నేతలు అభిప్రాయపడ్డారు.
సభ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి బస్సులు, వాహనాల ఏర్పాట్లతో పాటు కార్యకర్తల భద్రత, నిబంధనలు, సమయ పాలన తదితర అంశాలపై చర్చించి తగిన విధంగా కార్యాచరణను రూపొందించినట్లు తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు ఈ సభను ఒక చారిత్రక విజయంగా మార్చే దిశగా కృషి చేయాలని కోరుతూ డీసీసీ నాయకత్వం పిలుపునిచ్చింది. అసెంబ్లీ నియోజవర్గాలకు ఇంచార్జ్ లుగా నియమితులైన టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శిలు దుద్దిళ్ల శ్రీను బాబు, పల్లె శ్రీనివాస్ గౌడ్, మోత్కూరి ధర్మారావు లతో కలిసి చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇవి శ్రీనివాసరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు నాయిని లక్ష్మారెడ్డి, బంక సరళ సంపత్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ ఎనుకుంటి నాగరాజు, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.