02-01-2026 12:01:44 AM
అర్మూర్, జనవరి 1 (విజయక్రాంతి): దళిత, అణగారిన ప్రజల హరించివేయబడిన న్యాయమైన హక్కులు, ఆత్మగౌరవం కోసం భీమా కోరేగావ్ మహర్ యుద్ధ వీరుల పోరాటస్ఫూర్తితో పోరాడుదామని దళిత సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గురువారం ఆర్మూర్ మండల కేంద్రంలో బీమా కోరేగావ్ 208వ శౌర్య దివస్ని ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అంగరి ప్రదీప్ ఆధ్వర్యంలో భీమాకోరేగావ్ విజయ్ దివస్ను ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌక్లో వివిధ దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం భీమా కోరేగావ్లో 1818 జనవరి 1న జరిగిన యుద్ధంలో వీరమరణం పొంది అమరులైన మహర్ సైనికుల అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కెర భూమన్న, సామాజిక ఉద్యమకారుడు ములనివాసి మాల, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు డి లింగన్న,వికాస్ లు మాట్లాడుతూ రెండవ బాజీరావు పీష్వాల సైన్యంపై మహర్ రెజిమెంట్ పోరాట యోధుల యుద్ధ విజయానికి చిహ్నమే భీమాకోరేగావ్ శౌర్య దివాస్ అని 500మంది మహార్ వీరులు, 28వేల మంది పీష్వా బ్రాహ్మణ సైన్యంతో మహారాష్ట్రలోని పునా పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో కోరేగావ్ గ్రామంలో భీమా నది ఒడ్డున భీకర యుద్ధం చేసి విజయం సాధంచారని వివరించారు.
మహర్ వీరుల స్ఫూర్తితో మనువాదనికి వ్యతిరేకంగా పోరాడుతామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు అనంతరం బుద్ధవందన చేసి యోధులకు జోహార్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు సెక్రెటరీ పులి గంగాధర్, చిటుమాల నగేష్, మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ నాయకులు స్వామి, ఎర్రోళ్ల మల్కన్న, సాయన్న, రొడ్డ గంగాధర్, సాయిరాం, రాజు, మాన్వి, ఎమ్మార్పీఎస్ నాయకులు ఇందరపు రాజు, బుద్దిస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.