02-01-2026 12:00:00 AM
మనోరమ ఆసుపత్రిలో ఘటన
ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన, చెప్పులు, రాళ్లతో దాడి
నిజామాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మనోరమ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కాశమణి (45) మృతి చెందింది. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నంవెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కు చెందిన కాశమణి (45) ప్రభుత్వ ఉపాధ్యాయురాలి గా పనిచేస్తున్నారు. డిసెంబర్ 31న ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గడంతో అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట చౌరస్తాలోని మనోరమ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికీ తరలించారు. బుధవారం వరకు ఆరోగ్య రీత్యా కోలుకుంటున్న కాశమణి గురువారం ఆకస్మికంగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యులపై శాపనార్ధాలు పెడుతూ ఆస్పత్రి ఎదుట బైఠాయించి, చెప్పులు రాళ్లతో దాడి చేశారు. మృతురాలి బంధువుల ఆందోళనతో ఆస్పత్రి యజమాన్యం వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. చివరకు చర్చలు జరిపి కేసు లేకుండా రాజీ పద్ధతిలో వివాధం పరిష్కరించుకున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ప్రాణంకు రెండు లక్షల రూపాయలు ఖరీదు కట్టి మృతదేహాన్ని పంపించారు. మృతురాలు కాశమణికి భర్తతో పాటు బాబు పాప ఉన్నారు. వైద్యం సరిగ్గా చేయలేక తమ కుటుంబానికి ఆసుపత్రి యాజమాన్యం తీవ్ర అన్యాయం చేసిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో కాశమణి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధితులు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోయారు.