16-07-2025 12:56:30 AM
అడిషనల్ కలెక్టర్ ఫైజాన్‌అహ్మద్, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రాధిక
నిర్మల్, జూలై 16 (విజయక్రాంతి): వైకల్యం ఉందని దివ్యాంగులను చిన్నచూపు చూడొద్దని, వారికి కొంత ప్రోత్సాహమిస్తే సకలాంగులతో సమానంగా ఏదైనా సాధించగలరని అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా న్యాయసేవాసంస్థ(డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి రాధిక పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని టీఎన్జీవోస్ భవన్లో మంగళవారం దివ్యాంగశక్తి ఫౌండేషన్ మూడోవార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, స్వయంగా దివ్యాంగుడైన పంచగుడి మహేశ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ముందుగా పదోతరగతి, ఇంటర్లో ఉత్తమ మార్కులను సాధించిన దివ్యాంగులకు ప్రశంసాపత్రాలు, సర్టిఫిక్ఫెల్స్ అందించారు. దివ్యాంగుల కోసం సేవలందించిన వారికి దివ్యాంగమిత్ర విశిష్ట పురస్కారాలతో సన్మానించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ దివ్యాంగుల్లోనూ అంతర్లీనంగా అద్భుతశక్తి ఉంటుందన్నారు. కాస్తంత ప్రోత్సహిస్తే వారూ అన్నింట్లో రాణిస్తారని చెప్పారు. పారాఒలింపిక్స్లో పాల్గొనే దివ్యాంగులను చూసి స్ఫూర్తి పొందాలన్నారు. స్వతహాగా దివ్యాంగుడైన పంచగుడి మహేశ్ స్వయంగా ఉపాధి పొందుతూ తాను సంపాదించిన దాంట్లో నుంచి సమాజానికి ఖర్చు చేయడం చాలా గ్రేట్ అని అన్నారు.
దివ్యాంగులకూ ప్రత్యేక హక్కులతో పాటు చట్టాలూ ఉన్నాయని విశిష్ట అతిథిగా హాజరైన డీఎల్‌ఎస్‌ఏ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జి రాధిక అన్నారు. దివ్యాంగులకూ సత్వరమే న్యాయం అందించేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు. ప్రముఖ కంటివైద్యుడు కృష్ణంరాజు మాట్లాడుతూ దివ్యాంగులపై జాలి, దయ మాత్రమే చూపకూడదని, వారికి అవకాశాలు అందిస్తే సకలాంగులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తారని అన్నారు.
ఈ సందర్భంగా దివ్యాంగులకు సేవలందిస్తున్న వివిధ రంగాలకు చెందిన ముత్యంరెడ్డి(జిల్లా కార్మికశాఖాధికారి), మధుసూదన్(డీడబ్ల్యూఓ), డాక్టర్ స్వప్న(పిల్లల వైద్యులు), స్వర్ణలత (సామాజికసేవకురాలు), రోహిత్ధర్మసేన(సామాజిక సేవకుడు), అవధూత్ నరేశ్(స్పెషల్ టీచర్), రాసం శ్రీధర్(పాత్రికేయుడు)లకు ‘దివ్యాంగమిత్ర విశిష్టసేవా పురస్కారాల’ను అందించారు. కార్యక్రమంలో డీఈఓ రామారా వు, పెన్షనర్ల సంఘం జాతీయ నాయకుడు ఎంసీ లింగన్న, ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధి దిగంబర్, పడిగెల లక్ష్మీనారాయణ, దశాగౌడ్, శ్రీనిధి ఫౌండేషన్, దివ్యాంగశక్తి ఫౌండేషన్ల ప్రతినిధులు పద్మావతి, రజిత, అనూష, శ్యామ్, లక్ష్మణ్, పద్మ తదితరులు పాల్గొన్నారు.