10-09-2025 01:12:27 AM
వర్టెక్స్ ఇప్పటికే రెండు కేసులు నమోదు చేశాం
దళారీల వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్న అథారిటీ
సుంకరి నరేష్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన హైడ్రా
హైదరాబాద్, సిటీ బ్యూరో, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి):ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల్లో తాము తలదూర్చబోమని, అయితే చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదని హైడ్రా మరోసారి స్పష్టం చేసింది. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో వర్టెక్స్ రియల్ ఎస్టేట్ సంస్థకు, చైతన్య రెడ్డి అనే మహిళకు మధ్య నడుస్తున్న భూ వివాదంపై, తమపై సుంకరి నరేష్ అనే వ్యక్తి చేస్తున్న ఆరోపణలను హైడ్రా తీవ్రంగా ఖండించింది.వర్టెక్స్ సంస్థకు, చైతన్య రెడ్డికి మధ్య ఉన్న వివాదం పూర్తిగా ప్రైవేటు వ్యవహారమని హైడ్రా తేల్చిచెప్పింది.
చైతన్య రెడ్డికి చెందిన భూమిలో వర్టెక్స్ సంస్థ రోడ్డు వేసిందన్న వివాదంలో ఇరుపక్షాల వాదనలను పారదర్శకంగా విన్నామని, ఇది సివిల్ వివాదం కనుక వారే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో బాధితురాలు ఇప్పటికే పోలీసులను, న్యాయస్థానాన్ని ఆశ్రయిం చవచ్చని సూచించింది.అదే సమయంలో, ప్రభుత్వ భూముల పరిరక్షణలో తాము కఠినంగా వ్యవహరిస్తున్నామని హైడ్రా తెలిపింది.
సూరం చెరువులో వర్టెక్స్ సంస్థ చేపట్టిన అక్రమ నిర్మాణాలను తామే కూల్చివేశామని గుర్తుచేసింది. అలాగే కొత్తకుంట చెరువులో మట్టి పోసినందుకు వర్టెక్స్పై కేసు కూడా నమోదు చేశామని వెల్లడించింది. వాస్తవాలు ఇలా ఉంటే, వర్టెక్స్పై చర్యలు తీసుకో వడం లేదంటూ గతంలోనూ, మంగళవారం మరోసారి తమపై బురద చల్లే ప్రయ త్నం చేయడాన్ని హైడ్రా ఖండించింది.
ఈ వివాదంలో ఓ కొత్త కోణం కూడా వెలుగులోకి వచ్చిందని హైడ్రా పేర్కొంది. న్యాయ వాది సుంకరి నరేష్, మరికొందరు దళారులు తన నుంచి రూ. 50 లక్షలు తీసుకు న్నారని బాధితురాలు చైతన్య రెడ్డే స్వయంగా తమకు ఫిర్యాదు చేశారని హైడ్రా సంచలన విషయం బయటపెట్టింది. ఆ ఫిర్యాదు ఆధారంగా, చైతన్యరెడ్డిని, ఆమె ఆరోపించిన వ్యక్తిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించామని,
ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు కోసం పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయించామని తెలిపింది. ‘హైకోర్టు బార్ కౌన్సిల్ నుంచి తొలగింపునకు గురై, సాంకేతిక కారణాలతో స్టే తెచ్చు కున్న వ్యక్తి సుంకరి నరేష్ ఇప్పుడు మాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. దళారీల వ్యవహారంపై పోలీసుల దర్యాప్తులో నిజానిజాలు తేలుతాయి అని హైడ్రా పేర్కొంది. ప్రజలు ఇలాంటి దళారీల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై నేరుగా తమకు ఫిర్యాదు చేయవచ్చని హైడ్రా విజ్ఞప్తి చేసింది.