24-12-2025 12:37:27 AM
ఈజీఎస్ పేరు మార్పుపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వామపక్షాల నిరసన...
ఆదిలాబాద్/నిర్మల్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్న గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రజా పోరాటాలతోనే కాపాడు కోవాలని వామపక్షాల నాయకులు ప్రజలకు పిలుపు నిచ్చారు. మంగళవారం స్థానిక బస్టాండ్ ఎదుట ఈజీఎస్ పేరు మార్పు చేయడాన్ని నిరసిస్తూ సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కొత్త పథకం బిల్లు ప్రతులను ధగ్ధం చేసి, నిరసన తెలిపారు.
ఈ సందర్బంగా నాయకులు దర్శనాల మల్లేష్, సిర్రా దేవేందర్, జగన్ సింగ్ మాట్లాడుతూ... 2005 సంవత్సరంలో వామపక్షాల 64 మంది ఎంపీల బలం తో నాటి యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి సాధించిన గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నేడు ఆర్.ఎస్.ఎస్ భావజాలంతో పని చేస్తున్న బీజేపీ ప్రభుత్వం పేదల, పేదలు, సన్న, చిన్న కారు రైతుల పొట్ట కొట్టే విధంగా ఉపాధి చట్టంలో మార్పులు చేసిందని మండిపడ్డారు. పని గ్యారంటీ అనే దానికి బదులుగా గ్యారంటీ లేని స్థితికి తెచ్చిందన్నారు.
గాంధీ పేరును ఆర్.ఎస్.ఎస్ ఆదేశాల మేరకే తొలగించిందని ఆరోపించారు. జీ.రామ్.జీ పేరు పెట్టి పేదల కడుపు కొడతాము అంటే రామ్ జీ సైతం సహించడు అన్నసత్యాన్ని బీజేపీ గ్రహిస్తే మంచిదని హితవు పలికారు. పాత చట్టంలో 90 శాతం నిధులు కేంద్రం భరించాలని ఉంటే కొత్త పథకంలో కేంద్రం 60, రాష్ట్ర 40 శాతం భరించాలని మార్పులు చేసిందన్నారు. ప్రతీ ఏట పథకానికి నిధులు కోత విధిస్తు వస్తున్నదని మండి పడ్డారు.
ఇప్పటికి 800 కోట్ల రూపాయల వేతన బకాయిలు ఉన్నాయని తెలిపారు. పేదలు పోరాటం చేసి చట్టాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీ సీనియర్ నాయకులు బండి దత్తాత్రి, అన్నమొల్ల కిరణ్, ఆత్రం కిష్ట న్న, మంజుల, రాములు, చంద్రమౌళి, వివిధ పార్టీ ల నాయకులు పాల్గొన్నారు.
రాంజీ పేరు తొలగించాలి
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపా ధి పథకాన్ని మారుస్తూ జి రాంజీ పేరును చేర్చడంపై మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పట్టణంలోని గాంధీ పార్క్ లో గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపి జాతీయ రహదారిపై ధర్నా చేశారు.
మహాత్మా గాంధీ పేరును తొలగించి రాంజీ పేరును పెట్టడం మహాత్మాగాంధీని విస్మరించడమేనని నాయకులు పిలుపునిచ్చారు. ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పండుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీల నాయకులు నందిరామయ్య రాజన్న ఎస్‌ఎన్ రెడ్డి రాజు లక్ష్మి కుమార్ సురేష్ కుమార్ నూతన కుమార్ తదితరులు పాల్గొన్నారు