08-08-2025 01:29:48 AM
జనగామ, ఆగస్టు 7 (విజయక్రాంతి): గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ముఖ్యఅతిథిగా పాల్గొని చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
ప్రతి సంవత్సరం ఆగస్టు 7 న మనం జాతీయ చేనేత దినోత్సవం ని జరుపుకుంటామని, 1905లో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమాన్ని గుర్తు చేస్తూ, ఈ రోజు భారతీయ చేనేత పరిశ్రమలో పని చేస్తున్న లక్షలాది కార్మికుల కృషికి, నైపుణ్యానికి ప్రోత్సాహం అందిస్తూ ముందుకు పోతున్నామన్నారు. భారతదేశపు చేనేత రంగం మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపమని, గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా మహిళలకు ఉపాధి కల్పిస్తూ, స్వావలంభనకు మార్గం వేసే ఈ రంగం, దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
మనమందరం చేనేత వస్త్రాలు ధరించి చేనేతను ప్రోత్సహించాల న్నారు నేతన్నల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు శ్రీమతి చౌడేశ్వరి జిల్లాలోని చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, చేనేత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.