calender_icon.png 17 September, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి చేతికి లైసెన్స్ పత్రాలు

17-09-2025 12:00:00 AM

  1. కర్ణాటక దేవదుర్గ్‌లో ఖనిజాల అన్వేషణకు అనుమతి
  2. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నుంచి అందుకున్న సింగరేణి సీఎండీ

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): బంగారం, రాగి ఖనిజాల అన్వేషణ కు సంబంధించిన లైసెన్స్ పత్రాలు సింగరేణి చేతికి అందాయి. మంగళవారం టీ హబ్‌లో కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన కీలక ఖనిజాల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సెమినార్‌లో కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి చేతుల మీదుగా ఈ లైసెన్స్ పత్రాలను సింగరేణి సీఎండీ ఎన్ బలరాం అందుకున్నారు.

కర్ణాటక దేవదుర్గ్‌లోని బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు సంబంధించిన వేలంపాటలో లైసెన్స్‌ను సింగరేణి 37.75 శాతం రాయల్టీతో దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ బంగారం, రాగి ఖనిజాలను అన్వేషించే ప్రాంతం సుమారు 199 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఉంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఖనిజ రంగం అభివృద్ధి కోసం కేంద్రం రూ.32 వేల కోట్లను కేటాయించిందన్నారు.

కీలక ఖనిజాల అన్వేషణకు వేలంపాటలో విజేతలుగా నిలిచిన వారికి అభినందనలు తెలిపారు. వెంటనే అన్వేషణ పనులు ప్రారంభించాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో సింగరేణి సీఎండీ ఎన్ బలరాంతోపాటు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వల్లూరు క్రాంతి, సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జీఎంలు శ్రీనివాస్, శ్రీనివాసరావు, కనకయ్య పాల్గొన్నారు.