calender_icon.png 28 August, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్యకేసులో యావజ్జీవ శిక్ష రద్దు

14-03-2025 01:37:53 AM

నిందితుడిని దశాబ్దం తర్వాత నిర్దోషిగా తేల్చిన హైకోర్టు

హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): హత్యకేసులో నిందితుడికి కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. కాగజ్‌నగర్‌కు చెందిన కార్తీక్ అనే వ్యక్తి 2014లో హత్యకు గురయ్యాడు. ఈ కేసుపై విచారణ చేపట్టిన ఆదిలాబాద్ కోర్టు 2018లో షంషేర్‌ఖాన్ అనే వ్యక్తిని దోషిగా తేల్చి యావజ్జీవ శిక్ష విధించింది. తీర్పను సవాల్ చేస్తూ షంషేర్‌ఖాన్ హైకోర్టు అప్పీల్ చేశాడు.

అప్పీల్‌పై గురువారం జస్టిస్ కె.సురేందర్ విచారణ చేపట్టారు. ప్రాసిక్యూషన్ తీసుకున్న ఇద్దరు సాక్షుల వాంగ్మూలాలు సందేహాస్పదంగా ఉన్నాయని, షంషేర్‌ఖాన్ హత్య చేశాడనడానికి సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు నమ్మశక్యంగా లేవని న్యాయమూర్తి తెలిపారు. హత్య జరిగిన సమయంలో సాక్షులు అక్కడ ఏం చేస్తున్నారనే ప్రశ్నలకు సమాధానం లేవన్నారు.

నిజానికి హతుడు కార్తీక్ ఎవరో కూడా సాక్షులకు తెలియదంటూ.. షంషేర్‌ఖాన్‌కు కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను రద్దు చేస్తున్నట్లు న్యాయమూర్తి స్పష్టం చేశారు. షంషేర్‌ఖాన్‌పై ఇతర కేసులేవీ లేకపోతే వెంటనే అతణ్ని విడుదల చేయాలని ఆదేశించారు.