calender_icon.png 2 September, 2025 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంబీబీఎస్ అడ్మిషన్లకు లైన్‌క్లియర్

02-09-2025 12:34:50 AM

  1. స్థానికతపై జీవో నెం.33ను సమర్థించిన సుప్రీంకోర్టు
  2. ఇకపై రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్న మెడికల్ సీట్లు

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి) : వైద్య విద్యను అభ్యసించాలనుకునే రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు సుప్రీంకోర్టు శుభవార్త అందించింది. రాష్ట్రంలో వైద్య విద్యకు విద్యార్థులకు నాలుగేండ్ల స్థానికత తప్పనిసరి అని సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు రాష్ర్టంలోనే విద్యాభ్యాసం చేసి ఉండాలని స్పష్టంచేసింది. ఇకపై నాలుగేండ్ల నిబంధనను అమలుచేయాలని సూచిస్తూ తీర్పుచెప్పింది.

స్థానికతపై రాష్ర్ట ప్రభుత్వం జారీచేసిన జీవో నెం.33 ను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే గత సంవత్సరం అడ్మిషన్లు పొందినవారికి ఇది వర్తించదని, వారు యథావిథిగా కోర్సును కంటిన్యూ చేయవచ్చని తెలిపింది. గతంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి, డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు పక్కన పెడుతూ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక తీర్పును వెల్లడించింది.

ఈ అంశాన్ని సవాల్‌చేసిన విద్యార్థుల పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్, తదితర యూజీ కోర్సులకు జీవో నెం. 33 ప్రకారంగా స్థానికత వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ర్టం వెలుపల బదిలీ అయిన ఆల్ ఇండియా సర్వీసులు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే తల్లిదండ్రుల పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడానికి, రాష్ర్ట ప్రభుత్వం సూచించిన సవరణకు సుప్రీంకోర్టు ఒప్పుకుంది.

తల్లిదండ్రులు ఉద్యోగం వల్ల తెలంగాణ వెలుపల బదిలీ అయితే, వారి పిల్లలు కూడా లోకల్ కేటగిరీకి అర్హులేనని, వీరికి మినహాయింపు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, డిఫెన్స్, సీఏపీఎఫ్‌తోపాటు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్పోరేషన్లు, ఏజెన్సీల్లో పనిచేసే ఉద్యోగులు బదిలీపై దేశంలో ఎక్కడైైనా విధులు నిర్వహిస్తున్న తరుణంలో వారి పిల్లులు తల్లిదండ్రుల సర్వీస్ సర్టిఫికెట్ జతచేసి స్థానిక రిజర్వేషన్ పొందవచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది.

సుప్రీంకోర్టు తీర్పుతో మెడిసిన్ సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయి. ఈ తీర్పుతో ఆంధ్ర ప్రాంత విద్యార్థులు, స్థానికేతరులకు చుక్కెదురయినట్లే. వంద శాతం సీట్లు స్థానికులకే దక్కేలా తీర్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ చూపించింది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సిహ ఈ జీవో అమలుకోసం చేసిన ప్రయత్నం ఎంతో గొప్పదని వైద్య విద్యను అభ్యసించే విద్యార్థుల తల్లితండ్రులు ప్రశంసిస్తున్నారు.