04-12-2024 01:44:17 AM
హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో రియల్‌ఎస్టేట్ జోరు పెరుగుతోంది. రాష్ట్రంలో రియల్ జోరు తగ్గిందని, రిజిస్ట్రేషన్లు మందగమనంలో సాగుతున్నాయనే ప్రతిపక్షాల విమర్శలకు ప్రజాప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. మందగమనం కాదు, జోరు పెరిగిందనే నిజాలను గణాంకాలతో వెల్లడిం చింది.
రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. పైగా ఆదా యం కూడా పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు వేగంగా పెరుగుతున్నాయి. గత నవంబర్ పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. 2023 నవంబర్‌తో పోల్చితే 2024 నవంబర్‌లో రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చిన ఆదాయం భారీగానే పెరిగింది.
దాదాపు రూ.32.96 కోట్ల మేర రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరగడం గమనార్హం. 2023 నవంబర్‌లో మొత్తం రూ.1127.79 కోట్ల ఆదా యం రాగా, ఈ ఏడాది నవంబర్‌లో రూ.1160.75 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే గతేడాదితో పోల్చితే రూ.32.96 కోట్ల (2.92 శాతం) ఆదాయం పెరిగినట్టు స్పష్టమవుతుంది.
రెండు ప్రాంతాల్లోనూ పెరిగినయ్
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల పరిధి ప్రకారం చూసుకుంటే హెచ్‌ఎండీఏ, నాన్ హెచ్‌ఎండీయేగా విభజించవచ్చు. రిజిస్ట్రేషన్ల శాఖ వెల్లడించిన గణాంకా లను పరిశీలిస్తే ఈ రెండు ప్రాంతాల్లోనూ రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. 2023 నవంబర్ నెలతో పోల్చుకుంటే హెచ్‌ఎండీఏ పరిధిలో సానుకూల వృద్ధి నమోద య్యింది.
ఈ నవంబర్ ఒక్క నెలలోనే 625 డాక్యుమెంట్లు ఎక్కువగా రిజిస్ట్రేషన్ కాగా.. వీటి ద్వారా రూ.21.09 కోట్ల అదాయం వృద్ధి చెందడం విశేషం. అలాగే నాన్ హెచ్‌ఎండీఏ పరిధిలో పరిశీలిస్తే మొత్తం 3513 డాక్యుమెంట్లతో రూ.202.78 కోట్ల ఆదాయం సమకూరడం గమనార్హం.
మొత్తంగా వాణిజ్య సముదాయాలతో పోల్చితే నివాసగృహాలు, నివాస సముదాయాలు (అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూని టీలు)కు సంబంధించిన వాటి నుంచి వచ్చిన రిజిస్ట్రేషన్ల ఆదాయం గణనీయమైన వృద్ధిని సాధించినట్టు రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల సమాచారం స్పష్టంచేస్తుంది.
అంటే రాష్ట్రంలో రియల్‌ఎస్టేట్ జోరు తగ్గలేదని, అలాగే రిజిస్ట్రేషను ఆదాయం విషయం లో జోరు పెరుగుతూ వస్తోందనేది స్పష్టం గా అర్థమవుతుంది.
నెలలోనే 14 వేలకుపైగా పెరిగిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు
రియల్ ఎస్టేట్ బూమ్ కొనసాగుతూనే ఉందని డాక్యుమెంట్ల సంఖ్య కూడా చెప్తోంది. 2023 నవంబర్‌లో 1,05,235 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవ్వగా.. అదే 2024 నవంబర్‌లో ఆ సంఖ్య 1,19,317 కు చేరింది. అంటే గతేడాదితో పోల్చుకుంటే ఈ నవంబర్‌లో సుమారు 14,082 డాక్యు మెంట్లు (13.38 శాతం) పెరిగాయి. ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్టుగా రిజిస్ట్రేషన్లు తగ్గలేదని, ఆ ప్రచారం తప్పని స్పష్టమవుతోంది.