12-08-2025 10:38:28 PM
కల్హేర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) కల్హేర్ మండల పరిధిలోని ప్రజలకు ఎస్సై మధుసూదన్ రెడ్డి(SI Madhusudhan Reddy) ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... మరో మూడు(లేదా) నాలుగు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమతంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఎవరు ఉండరాదని సూచించారు.
పరివాహ ప్రాంతాల్లో నీటిలోకి ఎవరు వెళ్లొద్దని తెలిపారు. మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వాగులు, చెరువులు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో వాటి వద్దకు వెళ్ళోద్దని, దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలను హెచ్చరించారు. వర్షం కారణంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు షార్ట్ సర్క్యూట్ వచ్చే అవకాశం ఉన్నందున వాటికి దగ్గరగా మనుషులు, పశువులను కూడా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలను రోడ్లపైకి వెళ్లకుండా చూసుకోవాలని తెలిపారు. ఎవరైనా ఆపదలో ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్ కు, అధికారులకు లేదా డయల్ 100కి ఫోన్ చేస్తే సహాయాన్ని అందిస్తారని దీనికోసం పోలీసులకి సహకరించాలని ఎస్సై మధుసూదన్ రెడ్డి అన్నారు.