19-05-2024 12:05:00 AM
మంథనిలో మళ్లీ సీట్ల పంచాయితీ
అవకాశం పాత క్యాడర్‌కా.. కొత్త వారికా?
స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చోపచర్చలు
ప్రధాన పార్టీల్లో గుసగుసలు
మంథని, మే17 (విజయక్రాంతి): కార్యకర్తలు వెన్నంటి ఉంటాం.. కష్టపడిన వారికే అవకాశాలు.. అంటూ అన్ని పార్టీలు ఊదరగొడతాయి. చివరకు అసలు సమరాంగణం మొదలయ్యేసరికి బలం, బలగం చూసి అందలమెక్కిస్తాయనేది అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఈ క్రమంలో తమకు ఈసారి అవకాశం వస్తుందంటూ పార్టీని పట్టుకుని వేలాడుతున్న కొందరు లెక్కలు వేసుకుంటున్నారు. అప్పుడే మంథని నియోజక వర్గంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలలో టికెట్ల పంచాయతీ తెరమీదకు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీకి బలగం పెరగడంతో నియోజక వర్గం వ్యాప్తంగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. నిన్నటి లోక్‌సభ ఎన్నికలకు ముందు నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి ఆయా పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో చేరారు. దీనితో నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం మరింతగా పుంజుకుంది. లోక్‌సభ ఎన్నికలతో బీజేపీ పార్టీకి కూడా ఒకింత సైలెంట్ ఓట్లు పడటంతో ఆ పార్టీకి కూడా గ్రాఫ్ పెరిగింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఏ క్షణంలోనైనా పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని సామాజిక మాధ్యమాలలో జోరుగా ప్రచారం జరుగుతుండటంతో మంథని నియోజక వర్గంలోని ఆయా మండలాల్లో ఇప్పటి నుంచే ఆశావహులు అప్రమత్తం అవుతున్నారు.
ముందుగా అధికార కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు విషయంలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారని చర్చ మొదలైంది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ని అంటి పెట్టుకొని తన గెలుపు కోసం ఎంతో కష్టపడ్డ పాత క్యాడర్‌కే మంత్రి శ్రీధర్‌బాబు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని అనుకుంటున్నారు. ఐతే తమ రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచించి ముందస్తుగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కొత్త క్యాడర్ పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే ఎన్నికల్లో పదవులను ఆశించే పార్టీలోకి వలసలు వచ్చినట్లు అందరికి తెలిసిందే. ఐతే టికెట్ల విషయంలో కొత్తవారికి భంగపాటు ఎదురైతే తిరిగి బీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లే అవకాశం కూడా కోల్పోయారు. బీజేపీ పార్టీలోకి వెళ్లేందుకు ఒకింత ఛాన్స్ ఉన్నప్పటికీ ఆ పార్టీలో ఉంటున్న వ్యక్తులను కాదని కొత్తగా వచ్చిన వారికి టికెట్‌లు ఏలా ఇస్తారని అనుకుంటున్నారు. ఇక చివరకు స్వతంత్ర అభ్యర్తిగా పోటీ చేసేందుకు మాత్రమే చివరి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లేదంటే ధన బలంతో టికెట్లు తెచ్చుకుంటే పాత క్యాడర్‌కు నష్టం జరిగితే పరిణామాలు ఏలా ఉంటాయని చర్చించుకుంటున్నారు. దాదాపు అన్ని పార్టీలలో ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ఏదిఏమైనా ఈ పంచాయతీ పోరు పార్టీలకు తలనొప్పి తెచ్చేలా ఉందనేది మాత్రం స్పష్టమవుతుంది.