23-12-2025 02:14:44 AM
నాట్కో ఫార్మా కంపెనీలో భారీ మాక్ డ్రిల్ నిర్వహణ
మాక్ డ్రిల్ ను వీక్షించిన జిల్లా కలెక్టర్
రంగారెడ్డి, డిసెంబర్ 22( విజయక్రాంతి): అనుకోకుండా జరిగే విపత్తుల్లో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా వ్యవరిస్తే పెద్ద మొత్తంలో ప్రాణ,ఆస్తిన నష్టాలను నివారించవచ్చుని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం విపత్తుల సమయంలో సమర్థవంతమైన స్పందన కోసం విస్తృత స్థాయి మాక్ డ్రిల్ నందిగామ లోని నాట్కో ఫార్మా కంపెనీ లో విజయవంతంగా నిర్వహించబడింది. జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి ప్రత్యక్షంగా పాల్గొని అన్ని శాఖల చర్యలను పర్యవేక్షించారు.
మాక్ డ్రిల్ ద్వారా జిల్లా యంత్రాంగం అత్యవసర పరిస్థితులలో సమన్వయంతో, క్రమశిక్షణతో పని చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించిందని, భవిష్యత్తులో సంభవించే ప్రకృతి వైపరీత్యాలను, అగ్నిమాపక ప్రమాదాలను, పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించినప్పుడు ఎదుర్కోవడానికి ఇలాంటి మాక్ డ్రిల్లు కీలకమని కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. విపత్తుల సమయంలో అన్ని బృందాలు సమన్వయంతో పని చేయాలని, మాక్ డ్రిల్ నిర్వహించడం ద్వారా ప్రజల్లో, అధికారుల్లో విశ్వాసం పెరుగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో షాద్ నగర్ ఆర్డీఓ సరిత, అగ్నిమాపక అధికారులు, రెవెన్యూ, వైద్యశాఖ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.