08-05-2025 12:34:28 AM
రంగారెడ్డి, మే 7(విజయక్రాంతి): పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ మధ్య యుద్ధ వాతావరణం తలెత్తడంతో అత్యవసర సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై దేశవ్యాప్తంగా ప్రభుత్వం ఆపరేషన్ అభ్యాస్ పేరుతో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్‌కు శ్రీకారం చుట్టింది. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల నుంచి 4:30 వరకు మాక్ డ్రిల్ కార్యక్రమం చేపట్టారు.
డ్రిల్‌లో 12 శాఖల అధికారులు భాగస్వాములయ్యారు. యుద్ధం లాంటి అత్యవసర సమయాల్లో ప్రమాదం చోటు చేసుకుంటే వివిధ శాఖల అధికారులు సంయమనంతో తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలు సహకారం, సిబ్బంది వ్యవరించాల్సిన తీరుపై అవగాహన కల్పించారు.
నాలుగు చోట్ల..
రాష్ట్ర రాజధానిలో అత్యంత కీలకమైన ప్రదేశాలను గుర్తించి నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ ఏర్పాటు చేపట్టారు. గోల్కొండలోని నానల్‌నగర్, కంచన్‌బాగ్, మౌలాలి, సికింద్రాబాద్‌లో జన సముదాయం ఎక్కువగా ఉండే ప్రదేశాలను గుర్తించి ఏర్పాటు చేశారు. మాక్ డ్రిల్ ఏర్పాటు గురించి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అధికారికంగా ప్ర కటన చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు ఎమర్జెన్సీ సైరన్‌ను మోగించారు.
దీం తో సమీపంలోని ప్రజలంతా సురక్షిత ప్రాం తాలకు.. ఇండ్లకు పరుగులు తీశారు. పోలీసు ల సూచన మేరకు వివిధ శాఖల అధికారులు తమ ప్రత్యేక వాహనాలను మాక్‌డ్రిల్ చేసే ప్రదేశాల వద్దకు తరలించారు. అనంత రం వివిధ శాఖల అధికారులు మాక్ డ్రిల్ చే పట్టాయి. మొదట ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రమాదాలు జరిగిన సందర్భంలో క్షతగాత్రులను ఎలా రక్షించాలి? వారిని ఎలా చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించాలి?
ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది వివిధ భవనాల్లో ఉన్నవారిని ఎలా కాపాడాలి? క్షతగాత్రులకు అత్యవసర వైద్య చికిత్సలు చేసి మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక అంబులెన్సులో ఎలా తరలించాలి? లాంటి అంశాలపై డ్రిల్ చేపట్టారు.
మాక్‌డ్రిల్ నిర్వహించే వివిధ ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ శాఖల అధికారులు ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, క్యాండిడేట్స్‌తో మాక్‌డ్రిల్, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో రిస్క్ రిహార్సల్స్ చేశారు. మాక్ డ్రిల్‌ను సీపీ ఆనంద్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పరిశీలించారు. చివరగా 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం నేపథ్యంలో మాక్‌డ్రిల్ చేపట్టిన విషయం తెలిసిందే.
ఇది సన్నాహక చర్యే.. భయంవద్దు: సీపీ
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో బుధవారం సాయంత్రం 4 గంటలకు సైరన్ మోగించినట్టు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రజల్లో అప్రమత్తత పెంచడానికి ఇదో సన్నాహక చర్యేనని.. దీనిపై ఎవరూ భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్‌లో సివిల్ మాక్‌డ్రిల్ పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘పారిశ్రామిక సైరన్‌లు, పెట్రోల్ వాహనాల సైరన్లు, పోలీస్ సైరన్లు మోగించాం. సైరన్ మోగగానే ఎక్కడి వారు అక్కడే ఉండాలని సూచించాం. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని రకాల సూచనలు ఇచ్చాం. నాలుగు ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగినట్టు సమాచారం అందించాం. అన్ని శాఖల అధికారుల పనితీరు, స్పందన ఎలా ఉందో ఈ మాక్‌డ్రిల్స్ ద్వారా గుర్తించాం అని అన్నారు.