23-12-2025 12:00:00 AM
పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, డిసెంబర్ 22(విజయక్రాంతి): జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డిఎంఏ) జారీ చేసిన ఆదేశాల మేరక మెదక్ జిల్లాలో రెండు లొకేషన్లలో రెండు ప్రాంతాల్లో ఒకేసారి వర్షాలు, వరదలు లాంటి విపత్తులు సంభవిస్తే జిల్లా యంత్రాంగం ఎలా స్పందించాలి, సహాయక చర్యలు ఎలా సమన్వయంతో నిర్వహించాలి అనే అంశాలపై మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది.ఈ మాక్ డ్రిల్ను సోమవారం జిల్లాలోని రెండు లొకేషన్ లలో మొత్తం రెండు కీలక ప్రాంతాలలో ఏకకాలంలో నిర్వహించారు.
నిరంతర భారీ వర్షాల కారణంగా వరదలు, చెరువులు నిండిపోవడం, రహదారులు దెబ్బతినడం, ప్రజలు, పశువులు నీటిలో చిక్కుకుపోవడం, ఆసుపత్రులు, కాలనీలు నీటమునగడం వంటి విపత్తు పరిస్థితులను ఊహించి ఈ అభ్యాసం చేపట్టబడింది. ముఖ్యంగా హవేలి ఘనపూర్ మండలం ధూప్ సింగ్ తండా, బూరుగుపల్లి తదితర ప్రాంతాలలో వరద పరిస్థితులను సృష్టించి, వాటికి సంబంధించిన సహాయక చర్యలను ప్రత్యక్షంగా అమలు చేశారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, డ్రిల్ సాధారణ పరిశీలకులు, కరీంనగర్ డీఎఫ్‌ఓ శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ ఆర్డీవో రమాదేవి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వేణు, తో సహాయక చర్యల మాక్ డ్రిల్ పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ విపత్తుల సమయంలో ముందస్తు సన్నద్ధత, శాఖల మధ్య సమన్వయం ఎంతో కీలకమని తెలిపారు. ఇలాంటి మాక్ డ్రిల్ నిర్వహణ ద్వారా అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన అవగాహన పెరిగి, విపత్తు పరిస్థితుల్లో ప్రాణనష్టం, ఆస్తినష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు. డీఆర్డీవో పిడి శ్రీనివాసరావు, జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద్, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్రావు, పంచాయతీరాజ్ ఈఈ నరసింహులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, డాక్టర్ శివ దయాల్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీత, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ అహ్మద్, హవేలీఘన్పూర్ తాసిల్దార్ సింధు రేణుక, ఇతర శాఖల జిల్లా అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.