14-10-2025 06:09:56 PM
కలెక్టర్ పమేలా సత్పతి..
కరీంనగర్ (విజయక్రాంతి): యువత, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో పోలీస్, ఎక్సైజ్ శాఖ, శిశు సంక్షేమ శాఖ, వైద్య, తదితర శాఖల అధికారులతో జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై పాఠశాలలు, కళాశాలల్లో, బహిరంగ ప్రదేశాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్, ఎక్సైజ్, విద్యాధికారులు కలిసి రోడ్ల పక్కన పాఠశాలలు, పాన్ షాపుల్లో తనిఖీలు చేయాలని పేర్కొన్నారు.
విద్యార్థుల ప్రవర్తనను నిత్యం గమనించాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సూచించారు. అవగాహన కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ మత్తు పదార్థాలతో కలిగే దుష్పరిణామాలపై ఉపన్యాసం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించాలని పేర్కొన్నారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. మత్తు పదార్థాల నిర్మూలనకు నిత్యం గస్తీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్ళు, ఆర్టీసీ కార్గో, ప్రైవేట్ పార్సిల్ సంస్థలతో పాటు ఆన్లైన్ సంస్థలకు సంబంధించి గోదాములను తనిఖీ చేస్తున్నట్లు వివరించారు. డ్రగ్ డిడక్షన్ కిట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం నశా ముక్త్ భారత్ అభియాన్ క్యూ ఆర్ కోడ్ పోస్టర్ ఆవిష్కరించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ బాబు, డీడబ్ల్యుఓ సరస్వతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.