calender_icon.png 20 August, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిడిఎస్యూ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి

20-08-2025 07:14:49 PM

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యూ)

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): సెప్టెంబర్ 15,16 తేదీల్లో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించే పిడిఎస్ యూ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి గణేష్ పిలుపు నిచ్చారు. బుధవారం  పిడిఎస్యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఐఎఫ్టియూ జిల్లా కార్యలయంలో జరిగింది. ఈ సమావేశంలో  ఆయన మాట్లాడుతూ 1972లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అరాచకాలకు, ర్యాగింగ్, కుల వివక్షతకు వ్యతిరేకంగా నిలిచి పోరాడిన ఉస్మానియా అరుణతార కా.. జార్జిరెడ్డి  తన మిత్ర బృందంతో ఏర్పడిన ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది పేద విద్యార్థులకు అండగా నిలిచిందన్నారు.

శాస్త్రీయ విద్యాసాధనకై, సమసమాజ స్థాపన కై కదులుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కొరకు పోరాడుతూ అనేకమంది విద్యార్థులు తమ ప్రాణాలను ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం కొరకు త్యాగం చేశారు. వారి త్యాగంతో ఎరుపెక్కిన బిగిపిడికిలి జెండా నేటికీ విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటాలను నిర్వహిస్తూనే ఉందన్నారు. ఈ క్రమంలోనే గత ఉద్యమాల సమీక్షకై, నూతన కర్తవ్యాలకై రాష్ట్ర మహాసభలను వనపర్తి జిల్లా కేంద్రంలో అక్టోబర్ 28, 29, 30 తేదీలలో జరుపుకోబోతున్నది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభలను కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 16, 17 తేదీలలో జిల్లా కార్యవర్గం నిర్వహించనున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో విద్యారంగానికి మంత్రిని కేటాయించే పరిస్థితి కనబడటం లేదు. రాష్ట్రంలో విద్యార్థులకు అందాల్సిన స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్మెంట్ నేటికీ నాలుగు సంవత్సరాల నుండి పెండింగ్ లోనే ఉన్నాయి. గురుకులాలలో విష ఆహారం తిని విద్యార్థులు మరణాలపాలవుతున్నారు. సంక్షేమ హాస్టల్స్, ప్రభుత్వ విద్యాసంస్థలు సమస్యలకు నిలయగా మారినాయి. సమస్య ఉత్పన్నమైయినప్పుడు మాత్రమే అధికారులు విద్యాలయాలను పర్యవేక్షించడం తప్ప పరిష్కరించిన పాపాన ఏ అధికారి గాని పాలకులు గాని లేరు.

జిల్లాకు యూనివర్సిటీలో భాగంగా భద్రాద్రి జిల్లాకు యూనివర్సిటీ డిమాండ్ చేయగా ఎర్త్ యూనివర్సిటీని ప్రకటించి దాని అభివృద్ధిని మరిచారు. నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దానిని హామీకే పరిమితం చేసింది. విద్యారంగా అభివృద్ధిలో గిరిజన ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నాటి నుంచి నేటికీ అన్యాయమే జరుగుతుంది. ఈ జిల్లా సంపదను తరలించుకోవడమే తప్ప ఇక్కడ యువతకు ఉపాధి కల్పించే ఆలోచనలోనే పాలకులు లేరు.

విద్యారంగ సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఎన్నో ఉద్యమాలను నిర్వహిస్తున్న  పి.డి.ఎస్.యూభద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జిల్లా మహసభలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, అదేవిధంగా జిల్లా మేధావులు, కార్మికులు, కర్షకులు అన్ని వర్గాల ప్రజలు తమ సంపూర్ణ మద్దతును తెలియజేసి విజయవంతం చేయాలని వారుకోరారు.