13-09-2025 05:41:31 PM
నిజాం ప్రభుత్వాన్ని కూల్చిన ఘనత కమ్యూనిస్టులదే.
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): మట్టి మనుషులను పోరాట యోధులు గా మార్చింది కమ్యూనిస్టుల, ఎర్రజెండానే నని, కమ్యూనిస్టు లతో మమేకమై నాటి మట్టి మనుషులు సాగించిన విరోచిత పోరాట ఫలితమే నేటి ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్రమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. సెప్టెంబర్ 11నుండి 17 వరకు సీపీఐ ఆధ్వర్యంలో జరుగుతున తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్ నుండి పట్టణంలో ప్రదర్శన నిర్వహించి అమర జీవులు వృషారావు, నాదెండ్ల రామకోటయ్య, ఉప్పుశెట్టి ఖాదర్ బాబు స్మారక స్థూపాల కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
పాత RDO కార్యాలయం రోడ్ లో ఉన్న అమరవీరుల స్మారక స్థూపం వద్ద తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకులు నల్లమల్ల గురుప్రసాద్ చిత్రపటానికి, సీపీఐ మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్ధి వెంకటేశ్వర్లు విగ్రహానికి నివాళులు అర్పించి సీపీఐ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో సాబీర్ పాషా మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటం నేటికీ ప్రజలకు స్పూర్తినిస్తోందని, దున్నే వాడికే భూమి నినాదం దేశ వ్యప్తం చేసిందని కొనియాడారు. మహత్తరమైన, త్యాగపూరిత మైన సాయుధ పోరాటాన్ని మత పోరాటంగా చిత్రీకరిస్తూ నేటి ఆర్ఎస్ఎస్ వారసులుగా ఉన్న బీజెపీ లబ్ది పొందే కుట్ర చేస్తోందని విమర్శించారు.
తెలంగాణ విలీనం కోసం జరిగిన నాటి సాయుధ పోరాటం నుంచి స్వరాష్ట్రం కోసం జరిగిన తొలిదశ, మలిదశ విరోచిత పోరాటంలో విజయాలు సాధించిన తెలంగాణ గడ్డపై మతోన్మాదుల అటలు సాగవన్నారు. తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్చను పొందడం కోసం ఆనాటి యావత్ సమాజం కమ్యూనిస్టు యోధులు రావినారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మోహియుద్దీన్, బొమ్మగాని ధర్మభిక్షం, చాకలి ఐలమ్మ వంటి వారి నేతృత్వంలో ఉద్యమించిన తీరు ప్రతి ఒక్కరికి స్పూర్తి అన్నారు. తెలంగాణ విముక్తి పోరాటం ప్రపంచ ప్రజా ఉద్యమాలకు ఆదర్శమన్నారు. రజాకారుల రాచరిక పాలన నుంచి తెలంగాణ ప్రజలను రక్షించేందుకు వందల ఏండ్ల చరిత్ర ఉన్న నిజాం రాజును గద్దె దింపిందని, నిజాం స్వాదీనంలో ఉన్న తెలంగాణా భూ భాగాన్ని భారతదేశంలో అంతర్భాగం చేసింది కమ్యూనిస్టుల ఉద్యమేనన్నారు.
ఆ మహత్తర పోరాటంలో 4 500మంది యువ కమ్యూనిస్టులు ప్రాణాలు కోల్పోయారని, వారి ప్రాణత్యాగ ఫలితంగానే పది వేల గ్రామాలను విముక్తి లభించిందని అన్నారు. పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ చేశారని, ఇంత పెద్ద మొత్తంలో భూమిని పంచిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడా లేదని, నాడు రైతాంగి పోరాటంలో పంచిన భూముల్లో నేటి పాలకులు మూడో వంతు కూడా పంచలేదని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ అప్పటి ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీల నాయత్వంలో భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం, దోరలు, దేశ్ ముక్కుల పెత్తనం అంతంకోసం, ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం సాగిన పోరాటం నేటితరానికి ఆదర్శమన్నారు.