21-07-2025 07:54:03 PM
ఇల్లందు టౌన్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించనందుకు నిరసిస్తూ జూలై 23న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘం నాయకులు కోరారు. సోమవారం ఏలూరి లక్ష్మీనారాయణ భవనం నిర్వహించిన సమావేశంలో పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జె.గణేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు బి.కిషన్, పిడిఎస్యు పట్టణ కోశాధికారి గంగాధరి గణేష్, ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు రాజేష్, పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు శ్యామ్ పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడుస్తున్న విద్యాసంస్థలను గాలికి వదిలేయడం సరైనది కాదన్నారు.
పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు గత మూడు సంవత్సరాల నుండి రావలసిన స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ రూ.8600 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉండడంతో విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కాలేజీ యజమాన్యాలు ఫీజులు కడితేనే సర్టిఫికెట్స్ ఇస్తామని వేధిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం మన ఊరి మనబడి అనే కార్యక్రమం పెట్టి ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉన్న మూత్రశాలలను మరుగుదొడ్లను వంటశాలలను పాత బిల్డింగ్లను కూల్చివేసి కొత్తవి కడతామని చెప్పి గాలికి వదిలేశారన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీలు వేసి కనీసం విద్యార్థులకు అందించవలసిన మూత్రశాలలు మరుగుదొడ్లనైన నిర్మించకపోవడం వల్ల విద్యార్థులు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదన్నారు.
అమ్మాయిలు, అబ్బాయిలు బయటికి వెళ్లడం వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని భవనాలు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, వంట గదులను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కార్పోరేట్, ప్రయివేట్ విద్యాసంస్థలలో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఫీజుల నియంత్రణ చట్టాన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్య సంస్థలో పకడ్బందీగా అమలు చేయాలన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని తదితర డిమాండ్స్ పైన జూలై 23న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బందుకు పిలుపునివ్వడం జరిగిందని ఈ బందుకు విద్య సంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు మేధావులు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు రాజోలు మహేష్, నాగరాజు, ఎస్ఎఫ్ఐ నాయకులు కిషోర్, పిడిఎస్యు భార్గవ్, ఏఐఎస్ఎఫ్ సాయి తదితరులు పాల్గొన్నారు.