calender_icon.png 4 July, 2025 | 8:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

03-07-2025 10:48:35 PM

కార్మిక వ్యతిరేక  లేబర్ కోడ్స్ ను వ్యతిరేకించండి..

అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు.. 

మణుగూరు (విజయక్రాంతి): ఈ నెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె(General Strike)ను విజయవంతం చేసి, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ని వ్యతిరేకించాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. గురువారం సిపిఐ కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశంలో నాయకులు ఆర్ లక్ష్మీనారాయణ ఏఐటియుసి, వెలగపల్లి జాన్ ఐఎన్టియుసి, ఆర్ మధుసూదన్ రెడ్డి టియుసిఐ పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన నుండి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధానాలను, కార్మిక వ్యతిరేక, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. కార్మిక వర్గం పోరాడి, రక్త తర్పణ చేసి 8 గంటల పని దినం, సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకొనే హక్కు తదితర హక్కులతో పాటు అనేక చట్టాలను, సౌకర్యాలను సాధిస్తే, వీటన్నింటినీ కాలరాసే, విధంగా బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ను తీసుకువచ్చిందన్నారు.

ఈ లేబర్ కోడ్స్ అమలు అయితే యాజమాన్యాల దయాదాక్షిన్యాల మీద ఆధారపడే కట్టు బానిసలుగా కార్మికవర్గం తయారయ్యే ప్రమాదం ఉందన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ ను తిప్పికొట్టవలసిన బాధ్యత కార్మిక వర్గంపై ఉందన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు చేయాలని, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తదితర డిమాండ్ల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల, వివిధ ఫెడరేషన్ల, సంస్థల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుందని, ఈ సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేసి, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ ను, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలన్నారు. ఈ సమావేశంలో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు రాయల బిక్షం, కొత్తపల్లి సీతారాములు, బోశెట్టి సంపత్, అయితనబోయిన సతీష్, శ్రీనివాస్, సీతారాములు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.