calender_icon.png 11 November, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మామా అల్లుళ్ల హల్‌చల్

19-05-2024 01:08:15 AM

వివాదాస్పద భూమిపై ప్రత్యర్థులతో మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి సవాల్ 

కంచె తొలగింపు 

జీడిమెట్లలో నాలుగెకరాల భూమిపై వివాదం 

మాదంటే మాదంటూ పరస్పర ఘర్షణ

మేడ్చల్, మే 18 (విజయక్రాంతి): హైదరాబాద్ నగర శివారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఓ ప్రైవేటు స్థలం విషయంలో మాజీమంత్రి చామకూర మల్లారెడ్డికి మరికొందరికి మధ్య శనివారం ఘర్షణ జరిగింది. కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామ రెవెన్యూ పరిధిలోని సుచిత్ర సర్వేనంబర్ 82/1/ఈలో 4.24 ఎకరాల భూమి విషయంలో సీహెచ్ మల్లారెడ్డికి జాకీర్ అనే వ్యక్తికి మధ్య 2014 నుంచి వివాదం నడుస్తున్నది.ఈ భూమిని తాము పట్టాదారు నుంచి న్యాయబద్ధంగా కొన్నామని మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి చెప్తుండగా.. తాము ౨౦౧౨ లోనే ఈ భూమిని కొన్నామని అవతలిపక్షం వారు వాదిస్తున్నారు.

మల్లారెడ్డి ౨౦౧౬లో తన అనుచరులతో వచ్చి దౌర్జన్యంగా ఈ భూమిని ఆక్రమించుకొన్నారని ఆరోపిస్తున్నారు. ఈ వివా దంపై కోర్టులో పరస్పరం కేసులు కూడా వేసు కొన్నారు. మల్లారెడ్డి వైరిపక్షంవారు సదరు భూమిలో ౧.౧౧ ఎకరాలను శ్రీనివాస్‌రెడ్డి అనే  మరో వ్యక్తికి విక్రయించారు. దీంతో శ్రీనివాస్‌రెడ్డి, జాకీర్‌తోపాటు ఆ భూమిలో ప్లాట్లు కొన్నామన్ని చెప్తున్న ౧౫ మంది 17వ తేదీన అర్ధరాత్రి వివాదాస్పద భూమిలో ఉన్న ఇంటిని కూల్చివేసి మధ్యలోంచి ఇనుప రేకులతో ప్రహరీని నిర్మించారని స్థానికులు తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి శనివారం ఉదయం అక్కడకు చేరుకొని రేకుల ప్రహరీని కూల్చివేశారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. పేట్‌బషీరాబాద్ ఏసీపీ రాములు, సీఐలు సుమారు 50 మంది సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని రెండుపక్షాల వారిని చెదరగొట్టారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తమ భూమిలోకి అక్రమంగా చొరబడినవారిని వదిలేసి పోలీసులు తమను అడ్డుకోవటం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

పీఎస్‌లో చర్చలు

పరిస్థితిని అదుపుచేసేందుకు రెండువర్గాల వారిని పోలీసులు పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి చర్చలు జరిపారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డిని ఆ భూమిలో ఉండగా అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. స్టేషన్‌లో ఇరువురి భూమి పత్రాలను పరిశీలించి సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి పోలీసులతో మళ్లీ వాగ్వివాదానికి దిగారు.

గత పదేండ్లుగా ఆ భూమి తన ఆధీనంలోనే ఉన్నదని, యజమాని నుంచి న్యాయపరంగా కొన్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. సదరు భూమిని సర్వే చేయించి అవతలిపక్షం వారిది ఉన్నట్టు తేలితే తీసుకోవాలని సూచించారు. దొంగతనంగా చొరబడటం ఏమిటని, వారికి పోలీసులు సహకరించడం ఏమిటని నిలదీశారు. తమ భూమి విషయంలో న్యాయపరంగా కొట్లాడుతామని తెలిపారు. 

2012లోనే కొన్నాం: బాధితులు 

సుచిత్రలోని వివాదాస్పద భూమిలో 400 గజాల చొప్పున 2012లో తాము కొనుగోలు చేశామని బషీర్, శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 2016లో మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులతో వచ్చి తాము కట్టుకున్న ప్రహరీని కూల్చివేశారని ఆరోపించారు. దీనిపై మేడ్చల్ కోర్టును ఆశ్రయించగా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పారు. దీంతో గతంలో ప్రహరీ కూల్చిన ప్రాంతంలో ఇప్పుడు ఇనుప రేకులతో ప్రహరీని నిర్మించగా మల్లారెడ్డి తన అనుచరులతో వచ్చి దౌర్జన్యంగా కూల్చివేశారని ఆరోపించారు. మల్లారెడ్డి అనుచరులు 200 మంది కర్రలతో వచ్చి తమను తీవ్రంగా కొట్టారని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇరువర్గాలు ఫిర్యాదు చేయటంతోనే తాము ఘటనా స్థలానికి వెళ్లామని పేట్‌బషీరాబాద్ ఏసీపీ రాములు తెలిపారు. ప్రస్తుతం పరిస్థతి అదుపులోనే ఉన్నదని చెప్పారు. రెవెన్యూ అధికారులను పిలిపించి సర్వే చేయిస్తుండగా వర్షం రావడంతో పనులు నిలిచిపోయాయని వెల్లడించారు. కాగా, బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మల్లారెడ్డిని ఎదుర్కోలేక వెనక్కు తగ్గిన ఆయన ప్రత్యర్థి వర్గంవారు.. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో మళ్లీ తెరపైకి వచ్చినట్టు తెలిసింది. వారికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి అండదండలు ఉన్నట్టు వినికిడి.