calender_icon.png 11 November, 2025 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోగిని బట్టి రేటు

19-05-2024 01:05:43 AM

ప్రైవేటు అంబులెన్స్‌ల రూటే వేరు

గిరాకీ తగిలిందా అందిన కాడికి గుంజుడే

వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రి అడ్డాగా దందా 

వనపర్తి, మే 18 (విజయక్రాంతి):  అంబులెన్స్ అంటేనే అత్యవసర సేవా సర్వీస్‌లు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగి ప్రాణం నిలిపేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లే సంజీవని వంటి వాహనం. అటువంటి అత్యవసర సర్వీస్‌ను అడ్డం పెట్టుకుని కొంతమంది ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు మాత్రం రోగుల నుండి అడ్డగోలుగా దోచుకుంటున్నారు. దీంతో అడిగే నాథుడే కరువాయే అంటూ బాధితులు రోధిస్తున్నారు. 

రోగి పరిస్థితిని బట్టి కిరాయిలు 

అనారోగ్యం, అత్యవసర పరిస్థితుల్లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి రోగులు వచ్చి వైద్యం చేయించుకుంటారు. మరింత మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్, హైదరాబాద్ వంటి ప్రభుత్వ ఆస్పత్రులకు రిఫర్ చేస్తుంటారు. ఆ మాటే ప్రైవేటు అంబులెన్స్‌లకు కాసుల పంట పండిస్తోంది. రోగి పరిస్థితి ఏమిటో ఆస్పత్రిలోని కిందిస్థాయి సిబ్బంది తెలుసుకుంటారు. ఆ వెంటనే తమకు తెలిసిన అంబులెన్స్ వారికి సమాచారం అందిస్తారు. ఆ తర్వాత రోగి బంధువుల వద్దకు వచ్చి.. హడావుడి చేస్తారు. ప్రభుత్వ అంబులెన్స్ వచ్చేసరికి ఆలస్యమవుతుందని, తమకు తెలిసిన అంబులెన్స్ నంబర్ ఇచ్చి ఫోన్ చేయమంటారు. అంతే.. అక్కడి నుంచి కథ మొదలవుతుంది. 

ఆస్పత్రి సిబ్బందికి వాటా..

అధిక ధర వసూలు చేస్తున్నారని ప్రశ్నిస్తే ఆసుపత్రిలో కింది స్థాయి సిబ్బందికి ఇవ్వాలంటూ అంబులెన్స్ డ్రైవర్లు చెబుతున్నారు. పరిస్థితి బాగాలేకనే ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే హైదరాబాద్ వంటి ప్రాంతానికి వెళ్లడానికి అధిక ధరలు వసూలు చేస్తున్నారని ప్రైవేట్ అంబులెన్స్ వాళ్లను అడిగితే అర్ధరాత్రి, అపరాత్రి ఎప్పుడు పడితే అప్పుడు మాకు కిరాయిలు చెబుతుంటారు. ఆస్పత్రిలో పని చేసే కింది స్థాయి సిబ్బంది వాళ్లను కూడా చూసుకోవాలి.. వాళ్లకు కూడా అంతోఇంతో ఇచ్చుకోవాలి.. లేదంటే మాకు కిరాయిలు చెప్పంటూ అంబులెన్స్ డ్రైవర్లు బహిరంగంగానే చెబుతున్నారు. 

ఆస్పత్రి ఎదుటే అడ్డా..

జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ముందు ప్రైవేట్ అంబులెన్స్‌లకు స్టాండ్‌గా మారింది. ఆస్పత్రికి వచ్చే ప్రధాన రోడ్డు, నిత్యం ఎప్పుడు బిజిగా ఉండే రోడ్డులో ప్రైవేట్ అంబులెన్స్ నిలపడం వల్ల అటు రోగులకు, ఇటు ప్రజలకు , వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

దూరం కాదు.. రోగం లెక్క

రోగి బంధువుల నుంచి ఫోన్ రాగానే అంబులెన్స్ డ్రైవర్.. మరోసారి రోగి వివరాలు తెలుసుకుం టాడు. వ్యాధి తీవ్రతను బట్టి రేటు ఫిక్స్ చేస్తాడు. ఉదాహరణకు హైదరాబాద్ అయితే రూ.8వేలు  రూ. 9వేలు చెబుతారు. అంతెందుకు అని రోగి బంధువులు ప్రశ్నించే లోపే.. ఆస్పత్రిలోని సిబ్బంది ఆ ఫోన్ లాగేసుకుంటారు. మనకు తెలిసిన వాళ్లే చూసి తీసుకోమని మధ్యవర్తిత్వం వహిస్తుంటారు. చివరకు వెయ్యి వరకు తగ్గించి రూ.7వేలు  రూ. 8వేలు వసూలు చేస్తున్నారు. 

అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి

ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు ఇష్టారీతిగా రోగుల బంధువుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. నిర్ణీత దూరానికి నిర్ణీత ధర అనేది జిల్లా యంత్రాంగమే నిర్ణయించాలి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ప్రైవేట్ అంబులెన్స్ యజమానులకు వరంగా మారింది. ధర నిర్ణయించడంతోపాటు అంబులెన్స్‌ల ఫిట్‌నెస్‌ను కూడా ఆర్టీఏ అధికారులు నిర్ధారించాల్సిన అవసరం ఉంది.  

- గోపాలకృష్ణ, సీపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు