30-01-2026 12:07:15 AM
పాత కక్షలు కారణమంటున్న కుటుంబ సభ్యులు
వెల్దుర్తి, జనవరి 29: వెల్దుర్తి మండలం శేంషా రెడ్డి పల్లి తాండ గ్రామపంచాయతీ పరిధిలోని బండమీదిపల్లి లో బుధవారం రాత్రి ఒక వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. శేంషా రెడ్డి పల్లి తండా పంచాయతీ పరిధి బండమీదిపల్లికి చెం దిన గంపల బాలేష్ (47) అనే రైతు ఉదయమే బో రు మోటర్ బంద్ చేసి వస్తానని చెప్పి పొలం వద్దకు వెళ్లాడు. సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో తన కూతురు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అర్ధరాత్రి పొలం వద్దకు వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న తన తండ్రిని చూసి తన కూతురు స్థానికులకు సమాచారం ఇవ్వగా, ఈ విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాలేష్ మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు బలంగా కొట్టి చంపినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారనే కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.