30-10-2025 12:14:41 AM
రూ. 30 వేల జరిమానా, జిల్లా కోర్టులో న్యాయమూర్తి శిక్ష ఖరారు
కామారెడ్డి, అక్టోబర్ 29 (విజయ క్రాంతి): మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు 30 వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో కేజీబీవీలో 8వ తరగతి చదువుతున్న ఓ బాలిక మాచారెడ్డిలో వరుసకు నానమ్మ అయిన వాళ్లింటికి సెలవులు సమయంలో వచ్చేది.
అప్పుడప్పుడు కేజీబీవీ నుంచి వచ్చి రాత్రి సమయంలో అక్కడే నిద్రించేది. దసరా సెలవుల సమయంలో వచ్చిన బాలిక ఎప్పటిలాగే రాత్రి నిద్రిస్తుండగా పక్కఇంట్లో ఉండే భూక్య గణేష్ అనే వ్యక్తి నిద్రిస్తున్న బాలికను నిద్రలేపి అరిస్తే చంపేస్తా అని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం విషయం ఎవరికీ చెప్పవద్దని భయపెట్టాడు. దాంతో విషయం దాచిపెట్టిన బాలిక పాఠశాలకు వెళ్లిన అనంతరం అనారోగ్యానికి గురైంది.
ఆ సమయంలో జరిగిన విషయాన్ని తల్లికి చెప్పగా 2018 జనవరి 13న మాచారెడ్డి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దాంతో పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. కేసులో శిక్ష పడుతుందని భావించిన నిందితుడు గణేష్ విదేశాలకు పారిపోయినా తీసుకొచ్చి కోర్టులో హాజరుపర్చారు.
కోర్టులో పోలీసులు సాక్షాధారాలు సమర్పించగా నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 30వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. కేసు విచారణలో పాల్గొని నిందితుడికి శిక్ష పడేలా సాక్షాలు కోర్టులో సమర్పించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.