calender_icon.png 8 August, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రగాడనే అనుమానంతో హత్య

08-08-2025 12:00:00 AM

భద్రాద్రి జిల్లాలో ఘటన

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 7 (విజయక్రాంతి): మంత్రగాడనే అనుమానంతో వ్యక్తిని గ్రామస్థులు కొట్టి చంపిన ఘటన గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం పెద్ద వెంకటాపురం పంచాయతీ పరిధిలోని బూసురాయి గ్రామంలో చోటుచేసుకుంది. టేకులపల్లి సీఐ సత్యనారాయణ, ఆళ్లపల్లి ఎస్సై సోమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం..

బోసురాయి గ్రామానికి చెందిన పోడియం నందు కూతురు పోడియం గంగి(9) గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యానికి గురై బుధవారం మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన మడకం బీడ అలియాస్ రాజు (35) అనే వ్యక్తి చేతబడి చేయడంతోనే బాలిక మృతి చెందిందని భావిస్తూ కొందరు గుత్తి కోయలు రాజుపై కర్రలతో దాడి చేశారు. దీంతో రాజు తలకు బలమైన గాయమై మృతి చెందాడు.

ఆ తర్వాత మృతదేహాన్ని రాజు ఇంటి ముందు పడవేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ నిర్వహించారు. మృతుడు రాజు కుటుంబ సభ్యురాలు నందిని చేసిన ఫిర్యాదు మేరకు మడవి రాజు, మొక్కటి చిన్న సోమయ్య, మొక్కటి భీమయ్య, వజ్జ గంగ, వేకోజోగా, మొక్కటి వెంకటేశ్వర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.