28-08-2025 07:57:26 PM
నిర్మల్ (విజయక్రాంతి): వరదల్లో చిక్కుకున్నామని తక్షణం ఆదుకోవాలని సోన్ మండలంలోని మాదాపూర్ శివారులో ఉన్న ఐదుగురు పోలీస్ శాఖ 100 డయల్ కాల్ చేయడంతో వారిని పోలీసులు రక్షించారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోన్ మండలం మాదాపూర్ శివారులోని ఒక మామిడి తోటలో పని చేసే కుటుంబం రాత్రి కురిసిన భారీ వర్షంతో వ్యవసాయ క్షేత్రంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. కొద్ది గంటల్లోనే వరదనీరు వేగంగా పెరగడంతో ఐదుగురు వ్యక్తులు, 15 పశువులు అందులోనే చిక్కుకున్నారు.
ఈ విషయం ఉదయాన్నే డయల్–100 ద్వారా తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్(SP Janaki Sharmila) ఆదేశాల మేరకు, సోన్ ఎస్ఐ గోపీ తన సిబ్బంది, రెస్క్యూ బృందం, NDRF సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. అతి కొద్ది సమయంలోనే పోలీసులు రక్షణ చర్యలు చేపట్టి ముగ్గురు పెద్దలను, ఇద్దరు చిన్నారులను కాపాడి సురక్షిత ప్రదేశానికి తరలించారు. అదే విధంగా 15 పశువులను కూడా కాపాడారు. ఈ ఆపరేషన్‌లో సోన్ ఇన్స్పెక్టర్ గోవర్ధన్ రెడ్డి, ఎస్ఐ గోపీ, పోలీసు సిబ్బంది, NDRF బృందం ఉన్నారు.