16-08-2025 05:26:56 PM
జలకలను సంతరించుకుంటున్న ప్రాజెక్ట్
నిజాంసాగర్,(విజయక్రాంతి): భారీ వర్షాలనేపథ్యంలో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 31,000 క్యూసెక్కుల భారీ వరద నీది ప్రవాహం కొనసాగుతుందని ప్రాజెక్టు ఈ సోలోమన్ తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం1397.28 అడుగులతో 8.678 టీఎంసీల నీటి నిల్వతో కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయినా సింగూరు ప్రాజెక్టు ఐదు గేట్ల ద్వారా 43 వేల 674 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియా పరిధిలోని పోచారం జలాశయం మత్తరిపోస్తుండడంతో ఆదివారం ఉదయం వరకు ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. వరద నీటి ప్రవాహం ఇలాగే కొనసాగితే ఆదివారం ఏ క్షణానైనా వరద గేట్లను ఎత్తే అవకాశం ఉండడంతో మంజీరా పరివాహక ప్రాంత రైతులు పశువులు గొర్రెల కాపర్లు, మంజీరా నది పరివాహక ప్రాంతంలోకి వెళ్ళవద్దని ఆయన సూచించారు. ప్రాజెక్ట్ అనుసంధానంగా ఉన్న సింగీతం రిజర్వాయర్ నుండి నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలోకి 1000 క్యూసెక్కుల నీటిని మళ్లించినట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.